- వైట్ హౌస్‌లో సౌదీ ప్రిన్స్ మొహమ్మద్‌కు ఆతిథ్యం
- ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
వాషింగ్టన్: సౌదీ అరేబియాకు ఎఫ్35 ఫైటర్ జెట్ లను విక్రయించనున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఎస్ నుంచి 300 యుద్ధట్యాంకులను కూడా సౌదీ కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకోసం రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడించారు. అమెరికా పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు మంగళవారం ఉదయం వైట్ హౌస్ వద్ద ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం, క్యాపిటల్, క్రిటికల్ మినరల్స్ మార్కెట్లలో సహకారం, మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ నివారణలోనూ మరింత కోఆపరేషన్ కోసం ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. అయితే, అబ్రహాం అకార్డ్‌కు అంగీకరించి, ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలంటూ సౌదీని ట్రంప్ కోరారు. దీనిపై సౌదీ ప్రిన్స్ స్పందిస్తూ.. పాలస్తీనా ప్రత్యేక దేశానికి హామీ ఇస్తేనే ఆ ఒప్పందంలో భాగం అవుతామన్నారు. సమావేశంలో సౌదీ ప్రిన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో తమ పెట్టుబడులను 600 బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నామని ప్రకటించారు.
ఇది తమకు దీర్ఘకాలిక అవకాశమని చెప్పారు. కాగా, సౌదీకి ఎఫ్35 ఫైటర్ జెట్లను అందిస్తే.. ఆ టెక్నాలజీ చైనా చేతికి చిక్కుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్ చేస్తున్నందున, ఆ దేశానికి సమీపంలోనే ఉన్న దేశానికి ఈ ఫైటర్ జెట్లను ఇవ్వడంపై ట్రంప్ సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అధికారికంగా సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ దేశాధినేత కాకపోయినా ఆయనకు వైట్‌హౌస్ వద్ద ట్రంప్ ఘనంగా స్వాగతం పలకడంపై విమర్శలు వచ్చాయి.
ఏబీసీ రిపోర్టర్‌పై ట్రంప్ గరం
మీడియా సమావేశంలో ఏబీసీ చానెల్ కరస్పాండెంట్ మేరీ బ్రూస్ పై ట్రంప్ మండిపడ్డారు. ట్రంప్‌ను ఇబ్బందికి గురిచేసేలా మూడు ప్రశ్నలు వేయడంతో ఆయన ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్య విషయంలో సౌదీ ప్రిన్స్ మొహమ్మద్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏమంటారని ప్రిన్స్ మొహమ్మద్‌ను, ట్రంప్‌ను మేరీ బ్రూస్ ప్రశ్నించారు. దీంతో ఆ హత్యకు ప్రిన్స్ కు ఎలాంటి సంబంధంలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఖషోగీ మరణం బాధాకరమని, అదో పెద్ద తప్పిదమని ప్రిన్స్ మొహమ్మద్ అన్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలకు కాంగ్రెస్‌లో బిల్లు పాస్
లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ కు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను విడుదల చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు తాజాగా ఆమోదించాయి. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్‌తోపాటు అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఈ ఫైల్స్ విడుదలకు ఆయన ప్రభుత్వం అంగీకరించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం కొన్ని ఫైల్స్‌ను రిలీజ్ చేసింది. తాజాగా ట్రంప్ హయాంలో కాంగ్రెస్ కూడా అందుకు ఆమోదం తెలిపింది.
