అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో (SOTU) భారత్-పాకిస్తాన్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రమేయం వల్లే రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం ఆగిపోయిందని అన్నారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య గతేడాది మే నెలలో జరిగిన దాడిలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని చంపేవాళ్ళని, కానీ తాను జోక్యం చేసుకుని ఆయన్ని కాపాడానని ట్రంప్ అన్నారు.
తన జోక్యం వల్ల రెండు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధం ఆగిపోయిందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 పెద్ద యుద్ధాలను తాను అడ్డుకున్నానని ట్రంప్ వివరించారు. వాటిలో భారత్-పాక్ వివాదం అత్యంత ప్రమాదకరమైనదని చెప్పారు.
భారత్-పాక్‌తో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, అర్మేనియా-అజర్‌బైజాన్, ఈజిప్ట్-ఇథియోపియా వంటి దేశాల మధ్య గొడవలను కూడా తానే పరిష్కరించానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి కూడా తన ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని తెలిపారు.
తన నాయకత్వంలో అమెరికా ఇంతకుముందు లేనంత బలంగా, ధనిక దేశంగా మారిందని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ప్రస్తుత కాలాన్ని అమెరికా చరిత్రలో ఒక బంగారు యుగంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో అమెరికా పాత్ర ఇప్పుడు చాలా పెరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
