లండన్‌లోని హామర్‌స్మిత్ ప్రాంతంలో గత 16 ఏళ్ల నుండి నడుస్తున్న రంగ్రేజ్ అనే ఇండియన్ రెస్టారెంట్ వచ్చే నెలలో శాశ్వతంగా మూతపడనుంది. దీనికి కారణం పాకిస్తానీయులు, కొంతమంది తీవ్రవాదుల నుండి వస్తున్న దాడులేనని రెస్టారెంట్ ఓనర్ హర్మాన్ సింగ్ కపూర్ సంచలన ఆరోపణలు చేశారు.
పాకిస్తానీయుల నుండి పదే పదే దాడులు జరుగుతున్నాయని, రెస్టారెంట్ నడిపేందుకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా రోజు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులకి ఫిర్యాదు చేసిన కూడా సరైన రక్షణ లభించట్లేదని ఆయన అన్నారు.
ఖలిస్తాన్ ఉద్యమంపై విమర్శలు
హర్మాన్ సింగ్ కపూర్ గతంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ముఖ్యంగా రాడికల్ నేత అమృత్‌పాల్ సింగ్‌ను ఎగతాళి చేస్తూ చేసిన వీడియోలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ వీడియోల తర్వాత తన రెస్టారెంట్‌పై ఖలిస్తానీ సానుభూతిపరులు మార్చి 2023లో దాడి చేశారని ఆయన గతంలోనే ఫిర్యాదు చేశారు.
మీరు నా వ్యాపారాన్ని దెబ్బతీయగలరు కానీ, నా మనోధైర్యాన్ని కాదు. ఇప్పుడు నేను పూర్తిగా ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. రాబోయే రోజుల్లో నేను ఇంకా బలంగా తిరిగి వస్తాను అని కపూర్ ప్రకటించారు. 16 ఏళ్ల పాటు అతనికి మద్దతుగా నిలిచిన కస్టమర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
