ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' ఇక భారత్ సొంతం.. మోదీ పర్యటనలో చారిత్రక నిర్ణయం

ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' ఇక భారత్ సొంతం.. మోదీ పర్యటనలో చారిత్రక నిర్ణయం

భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగ బంధం మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ తంత్రాన్నే మార్చేసిన ఇజ్రాయెల్ అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన 'ఐరన్ డోమ్' మిస్సైల్ డిఫెన్స్ టెక్నాలజీని భారత్ తో పంచుకోవడానికి ఇజ్రాయెల్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రేవచ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కేవలం టెక్నాలజీని షేర్ చేయడమే కాకుండా.. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా భారత్‌లోనే సైనిక హార్డ్‌వేర్‌ను తయారు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఈ రక్షణ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకం కానుంది.

ఏమిటీ ఐరన్ డోమ్..? దీని ప్రత్యేకత ఏంటి..?
ఇజ్రాయెల్ గడ్డపైకి శత్రువులు ప్రయోగించే రాకెట్లు, డ్రోన్లు, మోర్టార్లను గాలిలోనే అడ్డుకుని వాటిని నిర్వీర్యం చేయడంలో ఐరన్ డోమ్ దిట్ట. 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో వచ్చే స్వల్పశ్రేణి లక్ష్యాలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీనిలోని రాడార్ వ్యవస్థ శత్రు రాకెట్లను గుర్తించి, అవి జనావాసాలపై పడతాయో లేదో లెక్కగడుతుంది. ప్రమాదకరమైన రాకెట్లపైకి మాత్రమే ఇంటర్‌సెప్టర్ మిస్సైళ్లను ప్రయోగిస్తుంది. దీని సక్సెస్ రేటు 90 శాతంగా ఉండటం విశేషం.

►ALSO READ | తమిళనాడు పాలిటిక్స్..కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ

భారత రక్షణ వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది?
భారత్ ఇప్పటికే ఆకాష్, ఎంఆర్-శామ్ వంటి పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను కలిగి ఉంది. అయితే ఐరన్ డోమ్ టెక్నాలజీ తోడైతే సరిహద్దుల్లో శత్రువుల నుంచి ఎదురయ్యే తక్కువ దూరపు రాకెట్ దాడులను ఎదుర్కోవడంలో భారత్ మరింత శక్తివంతంగా మారుతుంది. ముఖ్యంగా 'ఐ-డోమ్' వంటి మొబైల్ వేరియంట్లు మన సైనిక స్థావరాలు, కీలక ఆస్తులను కాపాడుకోవడంలో కీలకం కానున్నాయి.

కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా, భారత్‌తో కలిసి ఒక బలమైన అక్షాన్ని నిర్మించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇందులో అబ్రహం ఒప్పంద దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాలు, గ్రీస్, సైప్రస్ వంటి దేశాలను చేర్చి అంతర్జాతీయంగా ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్. ఈ రక్షణ ఒప్పందం వల్ల భారత్ కేవలం కొనుగోలుదారుగా కాకుండా.. అత్యాధునిక సాంకేతికతను స్వయంగా తయారు చేసే భాగస్వామిగా ఎదగనుంది.