- ఎస్సీ స్టూడెంట్స్‌కు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
- కాచిగూడలో కోచింగ్ సెంటర్, హాస్టల్ స్థలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్, బాబు జగ్జీవన్‌రామ్ హాస్టల్ మైలురాళ్లుగా నిలవనున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణ స్థలాన్ని, అనంతరం కాచిగూడ నింబోలీఅడ్డాలో ఆధునికీకరించనున్న బాబు జగ్జీవన్‌రామ్ హాస్టల్‌ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు.
నిర్మాణంపై అధికారులతో రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలెడ్జ్ టవర్ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల యువత భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రమని ఆయన పేర్కొన్నారు. పది అంతస్తులతో నిర్మించే ఈ టవర్‌లో డిజిటల్ లైబ్రరీలు, ఈ–లెర్నింగ్, రీసెర్చ్, కాంపిటీటీవ్ ట్రైనింగ్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాల్స్, కెరీర్ గైడెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇప్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉన్నత విద్య, కోచింగ్ కోసం హైదరాబాద్‌కు రాలేని విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లోనే అవకాశాలను కల్పించే వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు.
కాచిగూడ నింబోలీఅడ్డాలోని హాస్టల్ వేలాది మంది పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ హాస్టల్‌లో చదివిన స్టూడెంట్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారని గుర్తు చేశారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సుమారు రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, నింబోలీఅడ్డాలో సుమారు రూ.25 కోట్లతో అత్యాధునిక వసతులతో బాబు జగ్జీవన్‌రామ్ హాస్టల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
