
- అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి పనులను విభాగాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో వర్గీకరించి సమర్పించాలని డిప్యూటీ సీఎం, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సెక్రటేరియెట్లో శుక్రవారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మేరకు అధికారులకు భట్టి విక్రమార్క పలు కీలక సూచనలు చేశారు. ‘‘అభివృద్ధి పనులకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఏండ్ల వారీగా విభజించాలి. అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి హాజరుకావాలి.
సబ్-కమిటీ సభ్యులు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను హ్యామ్ (హ్యామ్) రోడ్ల పనుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి’’అని భట్టి సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పోలీసు విభాగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై మంత్రులు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు, సబ్-కమిటీ సభ్యులు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, వివిధ విభాగాల కార్యదర్శులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.