తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జపాన్ లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల సేవలను వారు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి.. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని.. రాష్ట్రంలో సంబంధిత యూనిట్ లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సంబంధిత సేవలు తెలంగాణలో అవసరమై ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో తరలి రావాలని ఆయన సూచించారు.
ALSO READ | మహిళా మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూసేకరణ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందన్నారు భట్టి. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో తోషిబా సేవలు అవసరమవుతాయన్నారు. అలాగే సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాలలోనికి ప్రవేశించనున్నంని.. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందుకు పోవచ్చని సూచించారు.
తోషిబా ఉత్పత్తుల కేంద్ర సందర్శన
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సమీపంలోని తోషిబా ఫ్యూయల్ సెల్ తయారీ యూనిట్ ను సందర్శించారు. న్యూక్లియర్ పవర్, థర్మల్ పవర్ ఉత్పత్తిలో వినియోగించే టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్ ని పరిశీలించారు. ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్, ఇతర బ్యాటరీల తయారీ విధానాన్ని పరిశీలించారు.
తెలంగాణలో తోషిబాను మరింతగా విస్తరిస్తాం
భారత్ లో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే తాము తమ యూనిట్లను ప్రారంభించామని తోషిబా అధికారులు వెల్లడించారు. దీనిలో తెలంగాణ ప్రముఖమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉన్నందున స్వయంగా కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ ఇక్కడ తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఈవీ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని తోషిబా అధికారులు తెలిపారు.
ప్రజా రవాణాలో జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచానికే ఆదర్శం: భట్టి
ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని శ్రీ భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. టోక్యో నగరం నుంచి ఆయన బుల్లెట్ ట్రైన్ లో మధ్యాహ్నం ఒసాకా పట్టణానికి బయలుదేరారు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ రైలుమార్గాన్ని కేవలం కేవలం 2 గంటల 20 నిమిషాలలో బుల్లెట్ ట్రైన్ ద్వారా చేరుకున్నారు. ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రైన్ లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి పరచడానికి పూనుకోవాలని రైల్వే శాఖను కోరనున్నట్లు శ్రీ భట్టి పేర్కొన్నారు.