- మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- మధిరలో రూ.140కోట్లతో
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మధిర, వెలుగు : రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లోని పేదల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంగళవారం మధిరలోని తన క్యాంపు ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు, అర్హులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుండగా 1.03 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు, పట్టణాల్లోని కాలేజీలు, స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చామన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు. మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో మహిళలకు రూ. 6000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు , ముఖ్య నేతలు సమష్టిగా పనిచేసి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రూ.140కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. మధిరలో వైరా నదికి రూ.65 కోట్లతో నిర్మించే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రూ.75 కోట్లతో చేపట్టే వరద కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్అనుదీప్ దురిశెట్టి, వివిధ శాఖల అధికారులు, మధిర వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు
