
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వారు రాజీనామా చేశారు. ఆదివారం గాంధీ భవన్ లో వారు కాంగ్రెస్లో చేరనున్నారు. తమ రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పంపించారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు తమను బాధించాయని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం 24 ఏండ్లు పనిచేసినా, ఉద్యమకారులకు విలువ లేకుండా పోయిందని వాపోయారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించామని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి తెలిపారు. శనివారం జీహెచ్ఎంసీ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. 24 ఏండ్ల పాటు బీఆర్ఎస్ లో ఉన్నామని, ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. అయినా, పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఇటీవల కేసీఆర్, కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించినా మూడు గంటలు వెయిట్ చేయించి చివరకు కలవనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.