విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్: రోనాల్డ్ రోస్

 విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవ్: రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: సెక్టోరల్ ఆఫీసర్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు. ట్రైనింగ్​ క్లాసులకు డుమ్మా కొడితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం జూబ్లీహిల్స్ సేవాలాల్ బంజారా భవన్​లో సెక్టోరల్ ఆఫీసర్లకు ట్రైనింగ్​ క్లాసులు నిర్వహించారు. విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన విషయాలపై పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు వల్నరబుల్ మ్యాపింగ్ తయారు చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు పని చేశాం కదా అనే భావనతో ఉండొద్దని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి ఆఫీసర్​ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. 

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని, ముఖ్యంగా వల్నరబుల్​మ్యాపింగ్ చేయాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం సెక్టోరల్ అధికారులకు ఈవీఎంల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈవీఎంలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. అడిషనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రె, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఏసీపీలు, సెక్టార్, పోలీస్​ అధికారులు పాల్గొన్నారు.