భారీ కటౌట్లు.. దేశ్ కీ నేత ఫ్లెక్సీలు..

భారీ కటౌట్లు.. దేశ్ కీ నేత ఫ్లెక్సీలు..

హైదరాబాద్ నగరం మళ్లీ గులాబీమయంగా మారిపోయింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ నగరంలో ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. దసరా నాడు జాతీయ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లకిరువైపులా ఫ్లెక్సీలు, హోర్డింగులతో నింపేశారు. బీఆర్ఎస్, దేశ్ కీ నేత అనే నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 5న దసరా నాడు టీఆర్ఎస్ భవన్ లో జరగనున్న సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ సహా పలు ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక జంజారాహిల్స్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఎటు చూసినా భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ టీఆర్ఎస్ నాయకులు, పలువురు నేతలు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న భారీ ఫ్లెక్సీలు, కటౌట్ లు, బ్యానర్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి సిటీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని, అలా చేస్తే తొలగించాల్సిందేనంటూ స్వయంగా మంత్రి కేసీఆర్ గతంలో ఆదేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే భారీ జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించింది. అయితే టీఆర్ఎస్ నేతలకు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.