Devdutt Padikkal: టీమిండియాలో నన్ను సెలక్ట్ చేయరని తెలుసు.. డొమెస్టిక్ క్రికెట్ పరుగుల వీరుడి ఆవేదన

Devdutt Padikkal: టీమిండియాలో నన్ను సెలక్ట్ చేయరని తెలుసు.. డొమెస్టిక్ క్రికెట్ పరుగుల వీరుడి ఆవేదన

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే డొమెస్టిక్ క్రికెట్ లో తప్పక రాణించాల్సిందే.  అయితే కొన్ని సార్లు దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించినా కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్ లో చోటు దక్కదు. ఇలాంటి లిస్ట్ లో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడికల్ ఉన్నాడు. కొన్నేళ్లుగా పడికల్ నిలకడకు భారత వన్డే జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కాలి. 147, 124, 22, 113, 108, 91,  35 ప్రస్తుతం విజయ్ హజారీ ట్రోఫీలో పడికల్ వరుసగా చేసిన పరుగులు. అంతేకాదు అంతకముందు సీజన్ లో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన చూపించాడు. 

తొలి వన్డేకు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంతో పడికల్ కు టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారు. అయితే పంత్ వికెట్ కీపర్ కావడంతో అతని స్థానంలో మరొక వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు. పడికల్ మాట్లాడుతూ పంత్ గాయంతో సిరీస్ కు దూరమైనా నన్ను ఎంపిక చేస్తారని నేను అనుకోలేదని చెప్పాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో జరిగిన పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.."నిజం చెప్పాలంటే టీమిండియాలో స్థానం దక్కుతుందని నేను అనుకోలేదు. రిషబ్ వికెట్ కీపర్. అతను గాయపడితే బ్యాకప్ వికెట్ కీపర్ ను ఎంపిక చేస్తారు. దీంతో నాకు స్క్వాడ్ లో పిలుపు వస్తుందని అనుకోలేదు". అని అన్నాడు. 

 విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లాడిన పడికల్ నాలుగు సెంచరీలు బాదేశాడు. శనివారం (జనవరి 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడికల్ ఈ సీజన్ లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో ఇప్పటివరకు 640 పరుగులు చేసి ఈ టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. పడికల్ వరుసగా మూడోసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్ లో 600 పైగా పరుగులు చేయడం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్ లలో 600 పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.

జార్ఖండ్‌పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసినా.. పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు. ఆ తర్వాత త్రిపురపై సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఓవరాల్ గా లిస్ట్ ఎ ఫార్మాట్‌లో పడిక్కల్‌కు 13వ సెంచరీ. మంగళవారం (జనవరి 6) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.