
పారదర్శక పాలనతోనే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సందర్భంగా మాట్లాడిన మోడీ…. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సాధనలో నీతి ఆయోగ్ దే కీలకపాత్రన్నారు. 2024 నాటికీ భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనకు రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమని, ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతులదే కీలకపాత్రన్నారు. రాష్ట్రాలు ఎగుమతులను ప్రోత్సహించాలని, జలవనరుల వినియోగంలో కొత్తగా వచ్చిన జల్ శక్తి శాఖ సమగ్ర విధానం తెస్తుందన్నారు. నీటి యాజమాన్యం, నీటి సంరక్షణలో రాష్ట్రాలు చొరవ తీసుకోవాలన్నారు మోడీ.
ఎన్నికల సమరం పూర్తయ్యిందని, ఇక దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. జీడీపీ వృద్ధి కోసం జిల్లా స్థాయి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై సమష్టిగా పోరాడాలన్నారు.