జిల్లాల్లో అభివృద్ధి పనులు పూర్తయినా ప్రారంభించట్లే

జిల్లాల్లో అభివృద్ధి పనులు పూర్తయినా ప్రారంభించట్లే

రాష్ట్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పూర్తయిన వర్క్స్​కు సీఎం కేసీఆర్​తోనే ఓపెనింగ్​ చేయించాలని​ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుదలగా ఉండడంతో వాటికి మోక్షం లభించడం లేదు. 2019లో నల్గొండకు మెడికల్ కాలేజీ మంజూరైనా ఇప్పటికీ పనులు స్టార్ట్​ చేయలేదు. సీఎంతో ఫౌండేషన్ స్టోన్ వేయించాలన్నది లోకల్​ ఎమ్మెల్యే ఆలోచన. కానీ కేసీఆర్​ మాత్రం టైం ఇవ్వడం లేదు. మహబూబ్​నగర్​లో కొత్త కలెక్టరేట్​ పూర్తయినా ప్రారంభించడం లేదు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కి పునాది రాయి వేయాల్సి ఉంది. దీనికీ సీఎం రావాలని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్, మెడికల్ కాలేజీ పూర్తయినా ముఖ్యమంత్రి వచ్చేది ఉందని ఆపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ఓపెనింగ్​ మంత్రి కేటీఆర్ టైం ఇయ్యక ఆగింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే సీఎం కేసీఆర్​, లేదంటే కనీసం మంత్రి కేటీఆర్​తో ఓపెనింగ్ చేయించాలని పై నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నందునే ఇలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఆపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా నిర్మాణాలు ఓపెన్ కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు సఫర్​ అవుతున్నారు. ​
– వెలుగు, నల్గొండ 

తెలంగాణలో పనులకు కొబ్బరికాయ కొట్టడానికి, పూర్తయిన వాటికి రిబ్బన్ కట్​ చేయడానికి ​సీఎం కేసీఆర్.. లేదంటే మంత్రి కేటీఆర్ చేయి పడితే తప్పా మోక్షం లభించడం లేదు. ఎందుకు పెండింగ్​లో పెట్టారని ఎమ్మెల్యేలను అడిగితే వారి నోట ‘కేసీఆర్, కేటీఆర్’ పేర్లే వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆఫీసర్​ చొరవ తీసుకుని పనులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రి పేర్లు చెప్పి అడ్డుకుంటున్నారు. సీఎం వస్తే నియోజకవర్గంలో తమ ఇమేజ్ మరింత పెరుగుతుందని భావించి ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు అపాయింట్​మెంట్ ​కోసం తిరుగుతున్నా పని కావడం లేదు. కనీసం కేటీఆర్ ను అయినా పిలుద్దామనుకుంటే ఆయన బిజీగా ఉన్నారంటూ దాటేస్తున్నట్టు సమాచారం.  

నల్గొండ జిల్లాలో ఇదీ పరిస్థితి

నల్గొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ 2019లో సాంక్షన్​ అయ్యింది. కానీ, ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలేదు. రూ.117 కోట్లతో నిర్మించాల్సిన మెడికల్ కాలేజీకీ  సీఎం వచ్చి ఫౌండేషన్​స్టోన్​ వేస్తే తప్పా పనులు స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. నాగార్జునసాగర్​లో 2005లో మొదలు పెట్టిన బుద్దవనం ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్​అయ్యింది. సుమారు రూ.70కోట్లతో దీన్ని పూర్తి చేశారు. గతేడాది ఆగస్టులోనే ఓపెన్ చేద్దామని అనుకున్నా కొన్ని కారణాలతో వాయిదా వేశారు. దీంతో  పర్యాటకులకు సందర్శించే భాగ్యం దక్కడం లేదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్​ విద్యాసాగర్ రావు కోరిక మేరకు రూ.1.55 కోట్లతో మార్కెట్ యార్డ్ నిర్మించి మూడేండ్లు దాటింది. ఇక్కడే ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. విద్యాసాగర్​రావు పేరుతో ఓ కాంట్రాక్టు సంస్థ కల్యాణ మండపం కూడా నిర్మించింది. ఇవన్నీ సీఎంతో ఓపెన్ చేయించాలని పెండింగ్​లో పెట్టారు.  

మహబూబ్​నగర్​ జిల్లాలో...

మహబూబ్​నగర్​లో కొత్త కలెక్టరేట్​ను సీఎం కేసీఆర్​తో ఓపెనింగ్ చేయిస్తామని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చాలాసార్లు ప్రకటించారు. వనపర్తి జిల్లాలో కంటే ఇక్కడే ముందు పనులైపోయినా సీఎం కేసీఆర్ మాత్రం వచ్చింది లేదు ఓపెన్ చేసింది లేదు. దీంతోపాటు మహబూబ్​నగర్​ పాత కలెక్ట రేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​ నిర్మిస్తామని మంత్రి జనవరిలో ఒక ప్రకటన చేశారు. 15 రోజుల్లో సీఎం కేసీఆర్​తో శంకుస్థాపన చేయిస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 

ఇతర జిల్లాల్లో...

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ బిల్డింగ్​ను సీఎంతో ఓపెన్ చేయించాలని పెండింగ్​లో పెట్టారు. జగిత్యాలలో కలెక్టరేట్​, మెడికల్​ కాలేజీలు పూర్తయినా ఇంకా ప్రారంభించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ పనులు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభోత్సవం మంత్రి కేటీఆర్ రాకతో ముడిపడి ఉంది. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, పోలీస్ హెడ్​క్వార్టర్​, ప్రభుత్వ దవాఖానా, మినీ స్టేడియాలకు కేసీఆర్ వచ్చి శంకుస్థాపన చేస్తేనే పనులు ప్రారంభించాలనే ఆలోచనలో ఎమ్మెల్యేలున్నారు. మెదక్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్,  మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటిని సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ చిన్నతనంలో చదివిన స్కూల్​ను రూ.10 కోట్లతో ఏడాది కిందటే నిర్మించారు. ఆయన రాకపోవడంతో ఇది ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తయ్యింది. లబ్ధిదారుల సెలక్షన్ కూడా పూర్తికావొచ్చింది. కానీ సీఎం వస్తేనే వీటిన్నింటిని మోక్షం కలగనుంది. దీంతో ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురుచూడాల్సి వస్తోంది.