మీ ముద్దు, మురిపాలు ఇంట్లో చేసుకోండి.. ఇక్కడ కాదు : పెళ్లి వేదికపై అడ్డుకున్న పూజారి

మీ ముద్దు, మురిపాలు ఇంట్లో చేసుకోండి.. ఇక్కడ కాదు : పెళ్లి వేదికపై అడ్డుకున్న పూజారి

ఈ మధ్య పెళ్లిళ్లు సినిమా షూటింగ్ ని తలపిస్తున్నాయి.. ఇప్పటి పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్లదే హడావిడి మొత్తం అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఒకప్పుడు పంతుళ్లు దగ్గరుండి పెళ్లిళ్లు జరిపిస్తే.. ఇప్పుడు మాత్రం ఫోటోగ్రాఫర్లదే డైరెక్షన్ అంతా. చేసేదేమీ లేక పంతుళ్లు కూడా ఈ ట్రెండ్ కి అలవాటు పడిపోయారని అనిపిస్తోంది. ఈ విషయంలో యువత కూడా ఏం తక్కువ తినలేదు.. సినిమాటిక్ ఫోటోగ్రఫీ కోసం లక్షల్లో ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అయితే.. ఈ పంతులు మాత్రం వెర్రితలలు వేస్తున్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ట్రెండ్ కి చెక్ చెప్పేలా వ్యవహరించారు. పెళ్లి మండపంలో రొమాంటిక్ ఫోజులతో జరుగుతున్న ఫోటోషూట్ ని అడ్డుకున్నారు ఓ పంతులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్న డీటెయిల్స్ అయితే తెలీదు కానీ.. హిందూ ఆచారాలు, సంప్రదాయాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసిందని చెప్పాలి.

చూడ ముచ్చటగా ఉన్న జంట, గ్రాండ్ గా, కలర్ ఫుల్ గా డెకరేట్ చేసిన పెళ్లి మండపం.. ఫోటోగ్రాఫర్లకు ఇంతకంటే ఏం కావాలి తమ క్రియేటివిటీ చాటుకునేందుకు చెప్పండి. అదే జరిగింది.. బ్యూటిఫుల్ కపుల్ తో రొమాంటిక్ ఫోటో షూట్ ప్లాన్ చేశారు. ఫోటోగ్రాఫర్ యాక్షన్ చెప్పాడు.. రొమాంటిక్ సాంగ్ తో.. ఫోటోషూట్ స్టార్ట్ అయ్యింది. వధూవరులు ఇద్దరు స్టేజి ఎక్కి ఒకరినొకరు ముద్దాడటం స్టార్ట్ చేశారు. అక్కడిదాకా సాఫీగా సాగింది..సినిమా క్లైమాక్స్ కి చేరింది అనుకున్న సమయంలో ఎంటరయ్యాడండి పంతులు గారు. ఆపండి ఏమిటి మీరు చేస్తున్నది.. బుద్దుందా..? అంటూ వధువరులు, ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. పంతులు చేసిన పనిని సమర్థిస్తూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తుంటే.. లక్షలు ఖర్చు పెట్టి ప్లాన్ చేసుకున్న ఫోటోషూట్ అడ్డుకునే హక్కు పంతులుకు ఎవరిచ్చారంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పెళ్లి పెద్దలకు లేని అభ్యంతరం పంతులుకి ఎందుకంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆధునికత, ఫ్యాషన్ ముసుగులో మంటగలిసిపోతున్న మన సంప్రదాయాలు, ఆచారాలు బతకాలంటే ఈ పంతులు లాంటివారు చాలామంది ముందుకు రావాలని అంటున్నారు కొంతమంది నెటిజన్స్.