Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన రైబాకినా, సబలెంకా.. తుది పోరు ఎప్పుడంటే..?

Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన రైబాకినా, సబలెంకా.. తుది పోరు ఎప్పుడంటే..?

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అరినా సబలెంకాకు తిరుగు లేకుండా పోతుంది. ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్ కు చేరుకున్న సబలెంకా అదే ఫామ్ ను కొనసాగించింది. గురువారం (జనవరి 29) జరిగిన సెమీ ఫైనల్లో ఎలినా స్విటోలినాను వరుస సెట్లలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 6-2, 6-3 తేడాతో స్విటోలినాను చిత్తు చేసి గ్రాండ్ గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓపెన్ ఎరాలో ఎవోన్ గూలాగాంగ్, మార్టినా హింగిస్ తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్ స్లామ్స్ లో ఫైనల్ కు చేరుకున్న మూడో క్రీడాకారిణిగా నిలిచింది.

సబలెంకా ఆటకు స్విటోలినా వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి సెట్ లో ప్రత్యర్థి సర్వీస్ రేబీడు సార్లు బ్రేక్ చేసి 6-2 తో సెట్ గెలుచుకుంది. రెండో సెట్ లోనూ అదే దూకుడు కొనసాగించి 6-3 తేడాతో రెండో సెట్ తో పాటు మ్యాచ్ ను గెలిచింది. మరో సెమీ ఫైనల్లో జెస్సికా పెగులాపై జరిగిన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో ఎలెనా రైబాకినా 6-3, 7-6(7) తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి సెట్ ను అలవోకగా గెలుచుకున్న తర్వాత రెండో సెట్ లో రైబాకినాకు పెగులా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈజీగా రెండో సెట్ గెలుస్తుంది అనుకుంటే పెగులా పోరాటంతో సెట్ టై బ్రేక్ వరకు వెళ్ళింది. 

Also Read : అభిషేక్, హెడ్, బట్లర్ కాదు.. అతడే వరల్డ్ కప్ టాప్ స్కోరర్

టై బ్రేక్ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగింది.  ఇద్దరూ 7-7 వద్ద ఉన్నపుడు మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. ఈ సమయంలో  రైబాకినా అద్భుతమైన ఆట తీరుతో పాయింట్ రాబట్టి 8-7 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ దశలో పెగులా సర్వీస్ లో అదిరిపోయే బ్యాక్ హ్యాండ్ షాట్ కొట్టి మ్యాచ్ గెలిచింది. ఫైనల్లో రైబాకినాతో సబలెంకా తలపడుతుంది. ఇద్దరి మధ్య ఫైనల్ సమరం శనివారం (జనవరి 31) జరుగుతుంది.