ఇంఫాల్: నాగాలాండ్‌లోని జుకో లోయలో సంభవించిన కార్చిచ్చు మణిపూర్ వైపు వేగంగా విస్తరిస్తోంది. బుధవారం (జనవరి 28) జుకో లోయలో మొదలైన మంటలు 48 గంటలకు పైగా నాన్ స్టాప్‌గా మండుతూనే ఉన్నాయి. గురువారం (జనవరి 29) మణిపూర్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎసి వరకు కార్చిచ్చు వ్యాపించింది. పొడి వాతావరణ పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు నాగాలాండ్ నుంచి మణిపూర్ వైపు దూసుకెళ్లడంతో స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోఅలర్టైన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) టీమ్స్ రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు సహయక చర్యలు చేపట్టాయి. స్థానిక ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది టూరిస్టులను రెస్క్యూ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకుజుకో లోయలో పర్యాటకంపై తాత్కాలిక నిషేధం విధించారు. సదరన్ అంగామి యూత్ ఆర్గనైజేషన్ (SAYO), సదరన్ అంగామి పబ్లిక్ ఆర్గనైజేషన్ (SAPO) కూడా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు.
మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టతరంగా మారినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇండియన్ నేవీ సహయం కూడా కోరినట్లు తెలిసింది. మరోవైపు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక మానవ తప్పిదమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కార్చిచ్చును వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురాకపోతే నాగాలాండ్, మణిపూర్‌లో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లితుందనిస్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
