ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'AA23' . వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఆ అంచనాలే వేరు. అయితే ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ.. ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
శ్రద్ధా కపూర్ రెండో తెలుగు చిత్రం?
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ గతంలో ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇటీవలే ఆమె నటించిన 'స్త్రీ 2' బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఒకవేళ #AA23లో ఆమె ఎంపిక ఖాయమైతే.. ఆరేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ఇదే అవుతుంది. అల్లు అర్జున్ సరసన శ్రద్ధా జోడీ వెండితెరపై సరికొత్త మేజిక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..
టీజర్‌తోనే రికార్డుల వేట!
సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. బన్నీ గుర్రాన్ని పట్టుకుని ఉన్న సిల్హౌట్ ఇమేజ్, సింహంలా ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించాయి. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే రీల్స్‌లో ట్రెండ్ అవుతూ లక్షలాది వ్యూస్ సొంతం చేసుకుంది. మరో వైపు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్ లేదా జూలై 2026లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
భారీ రెమ్యునరేషన్
ఈ ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్ సుమారు రూ.75 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది లోకేష్ కలల ప్రాజెక్ట్ అయిన 'ఇరుంబుకై మాయావి' (Irumbukai Maayavi) అనే సైన్స్ ఫిక్షన్ కథ ఆధారంగా తెరకెక్కుతోందని, అందుకే బన్నీకి సరిపోయేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని టాక్ విపిస్తోంది. అయితే ఈ సినిమాలో నటీనటులను పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
లోకేష్ యూనివర్స్ లో భాగమేనా?
ఈ సినిమా LCUలో భాగమా కాదా అనే దానిపై లోకేష్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, బన్నీ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ "ఇదొక సరికొత్త, ఉత్తేజకరమైన ప్రయాణం" అని పేర్కొన్నారు. ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలతో మ్యాజిక్ చేసిన లోకేష్, ఇప్పుడు ఐకాన్ స్టార్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అల్లు అర్జున్ మేనరిజమ్స్, లోకేష్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్.. వెరసి #AA23 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
