న్యూఢిల్లీ: ఇండియా, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పాల్గొంటుందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరించే యోచనలో పాక్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌పై భారత సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు టీ20 వరల్డ్ కప్ బాయ్ కాట్ చేసేంతా దమ్ము లేదన్నాడు.
పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని.. ఆ జట్టు మెగా టోర్నీ ఆడేందుకు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒకవేళ పాక్ వరల్డ్ కప్‌ను బాయ్ కాట్ చేస్తే ఆ జట్టు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నాడు. కాగా, భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో ఆడలేమంటూ టీ20 వరల్డ్ కప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరించిన విషయం తెలిసిందే.
బంగ్లాను భర్తరఫ్ చేసిన ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. ఐసీసీ బంగ్లాదేశ్‌ను బహిష్కరించడంతో ఆ జట్టుకు మద్దతుగా పాకిస్తాన్ కూడా వరల్డ్ కప్‌ను బాయ్ కాట్ చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే.. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. దీంతో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు పాక్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
