Ranveer Singh: మళ్లీ మొదలైన వివాదం.. హీరో రణ్‌వీర్ సింగ్‌పై FIR నమోదు!

Ranveer Singh: మళ్లీ మొదలైన వివాదం.. హీరో రణ్‌వీర్ సింగ్‌పై FIR నమోదు!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై నెలకొన్న కాంతారా వివాదం మళ్లీ ముందుకు వచ్చింది. ఇటీవల గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో ఆయ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ పెద్ద వివాదానికి పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

రిషబ్ శెట్టి బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' లోని కీలకమైన 'దైవ' సన్నివేశాన్ని ఆయన అనుకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. దైవాలను 'దైయ్యాలు' అని రణవీర్ మాట్లాడటం, ఆపై క్షమాపణ చెప్పడం అన్నీ జరిగిపోయాయి. అయినప్పటికీ ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రణవీర్పై FIR నమోదైంది. ప్రస్తుత వివరాల్లోకి వెళితే.. 

‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలోని రిషబ్ శెట్టీ పాత్రను అనుకరించినందుకు బెంగళూరులో రణ్‌వీర్ సింగ్‌పై FIR నమోదు అయ్యింది. బుధవారం, జనవరి 28న నమోదైన FIR ప్రకారం, రణ్‌వీర్ సింగ్ “దైవ సంప్రదాయాన్ని అవమానిస్తూ, ధర్మపరంగా అవినీతికరమైన విధంగా ప్రదర్శనలు చేశారని” ఆరోపించారు. ఈ FIR భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196, 299, మరియు 302 కింద నమోదు చేయబడింది. ఫిర్యాదుదారు తెలిపినట్టు, దేవుడిని ‘భూతం’గా అభివర్ణించడం హిందూ మత విశ్వాసాలకు ఘాతకంగా అవమానంగా చెప్పబడిందని వెల్లడించారు.

ఫిర్యాదు ప్రకారం, రణ్‌వీర్ సింగ్ చర్య “చాలా ఉద్దేశపూర్వక, చెడుగా, మతభావాలను రెచ్చగొట్టే విధంగా మరియు వేరే మత సమూహాల మధ్య ద్వేషాన్ని, హింసను, అసహనాన్ని పెంపొందించేలా” ఉందని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ఆయన చవుండి దైవంపై హానికరమైన అభిప్రాయాలను ప్రేరేపించారని, పౌరాణిక సంప్రదాయానికి అవమానం తెచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు.

రణవీర్ సింగ్ క్షమాపణ 

ముఖ్యంగా కన్నడిగులు, సినీ ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రణవీర్ సింగ్ క్షమాపణ సైతం చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. "నా ఉద్దేశ్యం కేవలం రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే. ఒక నటుడిగా, ఆ సన్నివేశంలో ఆయన చూపిన అసాధారణమైన కృషి నాకు తెలుసు. దాని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

►ALSO READ | Director Gunasekhar: విలువైన సమయం వృథా చేశా.. గత తప్పిదాలపై గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్..

అలాగే, సాంస్కృతిక వైవిధ్యం పట్ల తన గౌరవాన్ని తెలియజేస్తూ..  'నేను ఎప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం , నమ్మకాన్ని లోతుగా గౌరవించాను. నేను ఎవరి మనోభావాలను గాయపరిచినా, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని రణవీర్ సింగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. అయినప్పటికీ.. తాజాగా FIR నమోదు అవ్వడంతో సీన్ మళ్ళీ మొదటికి వచ్చింది. 

అసలు ఏం జరిగింది?

గోవాలోని IFFI వేదికపైకి వచ్చిన రణవీర్ సింగ్, 'కాంతార' క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి చేసిన 'దైవ' పాత్రను అనుకరించారు. రిషబ్ శెట్టిని నేరుగా సంబోధిస్తూ.. "నేను 'కాంతార చాప్టర్ 1' థియేటర్లలో చూశాను. అద్భుతమైన ప్రదర్శన. ముఖ్యంగా ఆ ఆడ దెయ్యం (చాముండి దైవ) నీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అద్భుతం. రిషబ్ నటనలోని తీవ్రతను, అద్భుతమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని కొనియాడారు. ఈ సమయంలోనే  రిషబ్ శెట్టి నవ్వుతూ కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో నెటిజన్లు రణవీర్ వ్యాఖ్యలు, అనుకరణ అగౌరవంగా ఉన్నాయని విమర్శించారు. దైవాలను కేవలం 'దెయ్యాలు'గా అభివర్ణించడం తీవ్ర అభ్యంతరకరమని, అవి అడవి దేవతలని, కేవలం దెయ్యాలు కావని వారు స్పష్టం చేశారు.