1992లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు గుణశేఖర్ వరుస విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రేమకథలైనా, దేశభక్తి నేపథ్యంలోని సినిమాలైనా, చారిత్రక కథలైనా తనదైన శైలిలో తెరకెక్కించగల దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2015లో విడుదలైన రుద్రమదేవి తర్వాత సుమారు ఎనిమిదేళ్ల విరామం తీసుకున్న ఆయన, 2023లో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం గుణశేఖర్ 'యుఫోరియా' అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా లేటెస్ట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదని, కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండటం వల్ల విలువైన సమయాన్ని వృథా చేశానని ఆయన చెప్పారు. ఇకపై ఎలాంటి విరామం లేకుండా నిరంతరం సినిమాలు చేస్తానని, బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
యుఫోరియా చిత్రంతో తప్పకుండా హిట్ సాధిస్తానన్న నమ్మకం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే తన అనుభవం, ఆలోచనా విధానం ఇప్పుడు మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. రాబోయే ప్రాజెక్టులు గతానికి భిన్నంగా, మరింత ప్రత్యేకంగా ఉంటాయని తనకు గట్టి నమ్మకం ఉందని అన్నారు. ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
►ALSO READ | Prabhas Kalki2 : ప్రభాస్ సరసన సాయి పల్లవి.. 'కల్కి2' కోసం నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్!
దర్శకుడు గుణశేఖర్: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ అంటేనే మనకు భారీ సెట్టింగ్‌లు, పౌరాణిక గాథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఒక సున్నితమైన , అత్యంత భయంకరమైన సామాజిక ఇతివృత్తంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేటి సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని ‘యుఫోరియా’ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిచింది. ఈ చిత్ర ట్రైలర్, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని ఆలోచింపజేసే ప్రశ్నలను కూడా సంధించింది.
విచ్ఛిన్నమవుతున్న కలలు
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. డ్రగ్స్ మత్తులో తూగుతున్న ఒక యువకుడు ఆమెపై జరిపిన అఘాయిత్యం, ఆ అమ్మాయి ఆశయాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఆ తర్వాత చోటుచేసుకున్న ఉత్కంఠభరిత పరిణామాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ఎదురుతిరిగిన మాతృమూర్తి
ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. "ఆమె చేసిన నేరం ఏంటి?" అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది.
