AUS vs PAK: వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి

AUS vs PAK: వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి

వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. గురువారం (జనవరి 29) లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్  చేతిలో ఊహించని రీతిలో ఓడిపోయింది. బౌలింగ్ లో పర్వాలేదనిపించిన ఆసీస్.. బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. మరోవైపు సొంతగడ్డపై పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. స్పిన్నర్లు చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకు పరిమితమై ఓడిపోయింది.  

టాస్ గెలిచి పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లో సాహిబ్జాదా ఫర్హాన్ గోల్డెన్  డకౌటయ్యాడు. ఈ దశలో సాయిమ్ అయూబ్ సల్మాన్ ఆఘా జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రెండో వికెట్ కు 74 పరుగులు జోడించిన తర్వాత సాయిమ్ అయూబ్ (40) ఔటయ్యాడు. కాసేపటికే సల్మాన్ ఆఘా (39) ఔట్ కావడంతో పాకిస్థాన్ 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఇక్కడ నుంచి పాకిస్థాన్ స్కోర్ వేగం మందగించింది. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకొని పాకిస్థాన్ ను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీసుకొని రాణించాడు.   

169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే మాథ్యూ షార్ట్ (5) వికెట్ కోల్పోయింది. వెంటనే ట్రావిస్ హెడ్ (23) కూడా ఔట్ కావడంతో 28 పరుగులకే ఆస్ట్రేలియా తమ ఓపెనర్లను కోల్పోయింది. మాట్ రెన్షా (15),కామెరాన్ గ్రీన్ (36) కలిసి 40 పరుగులు జోడించి ఆసీస్ ను లక్ష్యం వైపు నడిపారు. పవర్ ప్లే తర్వాత పాకిస్థాన్ స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీనికి తోడు రెండు రనౌట్ లు కావడం ప్రతికూలంగా మారింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో ఆసీస్ కు పరాజయం  తప్పలేదు. చివర్లో జేవియర్ బార్ట్‌లెట్ (34) మెరుపులు నేర్పించినా ఫలితం లేకుండా పోయింది.