ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులు ఆగుతున్నాయ్

ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులు ఆగుతున్నాయ్

హైదరాబాద్ , వెలుగు:ఒక ఎన్నికలు ముగియగానే మరో ఎన్నికలు.. వాటితోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్).. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇదే నడుస్తోంది. దీంతో పాలన ముందుకు సాగడం లేదు. అభివృద్ధిపనులు ఆగిపోతున్నాయి . గత ఏడాది సెప్టెంబర్​లోఅసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కొన్నిరోజులకు అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. డిసెంబర్​లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగగా.. అటు తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆపై ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ నడుస్తోంది. నాలుగు రోజుల క్రితమే లోక్ సభ ఎన్నికలు రాష్ట్రంలో ముగిసినప్పటికీ కోడ్ మాత్రం మే చివరివారం వరకు కొనసాగనుంది. త్వరలోనే మండలపరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి . పరిషత్ ఎన్నికలు ఈనెల లేదా వచ్చే నెలలో జరిగే అవకాశం ఉండగా.. మున్సిపల్ ఎన్నికలు మాత్రం జూన్​లో జరిగే పరిస్థితి కనిపిస్తోం ది. దీంతో జూన్​ వరకు కూడా రాష్ట్రంలో కోడ్ అమలులో ఉండనుంది. రాష్ట్రంలో ఏడు, ఎనిమిదినెలలుగా కొద్దిరోజుల గ్యాప్ తో మళ్లీ మళ్లీ కోడ్ వచ్చిచేరుతోంది. కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి వీల్లేదు.

సచివాలయం వెలవెల

వరుస ఎన్నికలు, దాని వల్ల కోడ్ అమలులో ఉండటంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది.సచివాలయం వెలవెలబోతోంది. వివిధ పనుల నిమిత్తం, అధికారులను, మంత్రులను కలిసేందుకు,సీఎంఆర్ ఎఫ్ కోసం ఇక్కడికి వచ్చే వారు గత ఏడు,ఎనిమిది నెలలుగా రావడం లేదు. ఇక ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరిం చిన తర్వాత మంత్రులు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతుండటంతో.. వాళ్లు కూడా సచివాలయం వైపు రావడం లేదు. దేశంలో ఏరాష్ట్రంలో కూడా ఇంతకాలం ఎన్నికల కోడ్ లేదని అధికారులు అంటున్నా రు.

ఆగిన పథకాల అమలు

పెంచిన ఆసరా పెన్షన్లను ఏప్రిల్ 1 నుంచి అందిస్తామని సీఎం కేసీఆర్  ప్రకటించినప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అది జూన్ వరకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోం ది. ఇప్పుడు 39లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతుండగా.. పెన్షన్ వయస్సు 65 నుంచి 57 కు తగ్గించటం, గతంలో కంటే పెన్షన్ ఎక్కువ ఇవ్వటం వంటి వాటితో రాష్ట్రవ్యాప్తంగా మరో 8 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.పెన్షన్లకు రూ. 10వేల కోట్లు ఖర్చు కానుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. ఎన్నికల నిర్వహణలో అధికారులు బిజీగా ఉండటంతో పెన్షన్ పథకానికి కొత్త లబ్ధిదారుల ఎంపిక విధానం నిదానంగా సాగుతున్నట్లు తెలుస్తోం ది.

పెండింగ్ లో రూ. వేల కోట్ల బిల్లులు

రాష్ట్రంలో ఏడు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి రూ. వేల కోట్ల బిల్లులు విడుదల కాలేదు. డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులకే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. జనవరి నెల మొత్తం ఆ ఎన్నికలు జరిగాయి. ఇక ఫిబ్రవరిలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 నెలల పాటు పరిపాలన సాగేందుకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇంతలో మార్చి10న లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే28 వరకు ఈ కోడ్ కొనసాగనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చినా కోడ్ వల్ల బిల్లులు చెల్లించటం లేదు. ముఖ్యం గా నీటి పారుదల ప్రాజెక్టుల పనులు, రోడ్లు భవనాల శాఖ పనులు చేపట్టిన కాం-ట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల పీఆర్సీ పెండింగ్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, ఐఆర్ , పదవీ విరమణ వయస్సు పెంపు డిమాండ్లు పరిష్కరించాల్సినప్పటికీ ఎన్నికల కోడ్ తో బ్రేక్ పడింది. పీఆర్సీ గత ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఇది ఆలస్యమవుతున్నందున మధ్యంతర భృతి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దానికి కూడా బ్రేక్ పడింది. ఇక పదవీవిరమణ వయస్సు పెంపు వల్ల ప్రభుత్వం పై భారీగా ఆర్థికభారం పడనుంది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నాటి నుంచి ప్రతి నెల సుమారు 500 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ డిమాండ్లనీ జూన్ నుంచి అమలు కానున్నట్లు తెలుస్తోం ది.

రైతు బంధు యథాతథం

గత ఏడాది డిసెంబర్ లో ఆర్బీఐ నేరుగా ట్రెజరీల ద్వారా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పెట్టు బడి సాయం బదిలీ చేసింది. అప్పుడు సుమారు 6 లక్షలమందికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మిగతా లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. వారి ఖాతాల్లో సొమ్ము జమచేసింది. కోడ్ ఉన్నసమయంలో నిధులు ఎలా బదిలీ చేస్తారని ఇతర పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నా రు.