V6 News

నియోజకవర్గ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు తెచ్చా : మంత్రి వాకిటి శ్రీహరి

నియోజకవర్గ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు తెచ్చా : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: పదవులు శాశ్వతం కావని,  చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలుస్తాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  అన్నారు. బుధవారం మక్తల్ మండలం చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య పెద్దవాగుపై రూ.20 కోట్లతో నిర్మించనున్న వంతెన, చెక్‌‌‌‌డ్యామ్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో దాదాపు 20 గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో బ్యారేజీ- కమ్-బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి రూ.710 కోట్లతో మాగనూర్ మండలం కొల్పూర్ వద్ద మినీ జూరాల ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  మక్తల్‌‌‌‌లో ఇప్పటికే 150 పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, కోర్టు, మక్తల్, నారాయణపేట ఫోర్‌‌‌‌ లేన్ రహదారి విస్తరణ, మక్తల్ స్టేడియం వంటి పనులకు దాదాపు రూ. వెయ్యి కోట్లు తెచ్చామని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరి దృష్టి అభివృద్ధిపైనే ఉండాలని అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకుండా విమర్శలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. 

గత ప్రభుత్వ కాలంలో డబుల్ బెడ్‌‌‌‌రూం ఇళ్లు అందలేదని, ప్రస్తుతం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మక్తల్ మండలం గోలపల్లి–మంథన్‌‌‌‌గోడ్ రహదారిపై రూ.1.50 కోట్లతో నిర్మించనున్న వంతెనకు కూడా భూమిపూజ చేశారు. త్వరలో మక్తల్‌‌‌‌కు 220 కేవీ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ను తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ మానస, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, సర్పంచ్‌‌‌‌లు సూర్యకుమార్, రాజేందర్ గౌడ్, రహమత్ పాషా, రాములు తదితరులు పాల్గొన్నారు.