రోడ్లు పైకి బజార్లు కిందికి.. ఇంజినీర్ల సొంత ఎజెండా..!

రోడ్లు పైకి బజార్లు కిందికి.. ఇంజినీర్ల సొంత ఎజెండా..!

 

  • రోడ్లు పైకి.. బజార్లు కిందికి!
  • నల్గొండలో ఇంజినీర్ల సొంత ఎజెండా


నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ దత్తత పట్టణం నల్గొండలో చేపడుతున్న అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా మారాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లను వెడల్పు చేయడంలో అధికారులు సొంత ఎజెండా అమలు చేస్తున్నారు. ఆర్ అండ్ బీ పరిధిలో జరగాల్సిన రోడ్ల నిర్మాణంలో మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్లను ఇన్వాల్ చేయడంతో ఆయా శాఖల మధ్య సమన్వయం లేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. నల్గొండ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి పెద్దబండ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు. దీని అంచనా వ్యయం రూ.46 కోట్లు. ప్రస్తుతం వివేకానంద విగ్రహం నుంచి క్లాక్​టవర్ వరకు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని పొడవు 1.2 కిలోమీటర్లు. ఈ రోడ్డుకు ఇరువైపులా 18 బజార్లు ఉన్నాయి. కాగా రూల్స్​కు విరుద్ధంగా పాత రోడ్డుపై అడుగున్నర ఎత్తు పెంచి కొత్త రోడ్డు వేస్తున్నారు. దీంతో ఇరువైపులా ఉన్న బజార్లు, షాపులు, సెల్లార్లు డౌన్ అయ్యాయి. రోడ్డు హైట్​పెంచడం వల్ల వరద నీరంతా కాలనీల్లో చేరుతోంది. నిజానికి పాత రోడ్డుకు కుడి, ఎడమ వైపున ఐదు ఫీట్లు వెడల్పు చేసి పాత రోడ్డు తవ్వాక, అదే రోడ్డుపై రెండు ఇంచుల డాంబర్ వేయాలన్నది ఆర్ అండ్​ బీ ప్లాన్. ఇలా చేస్తే నిర్మాణవ్యయం పెరుగుతుందున్న కారణంతో పాత రోడ్డునే ఫీటున్నర ఎత్తు పెంచారు. కానీ ప్రతి రెండు, మూడేళ్లకోసారి బీటీ రెన్యువల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న రోడ్డుపై మరోసారి డాంబర్ వేయాల్సి వస్తే అప్పుడు రోడ్డు హైట్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అధికారుల అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. 

వర్షకాలంలో తప్పని తిప్పలు

వర్షాకాలంలో కొండలు, గుట్టల పైనుంచి వచ్చే వరద నీరంతా నల్గొండ పట్టణంలోని కాలనీల్లోకి చేరుతుంటుంది. కాలనీల్లోని డ్రైనేజీల ద్వారా,  దిగువ ప్రాంతాల మీదుగా పట్టణ శివారుల్లో కి వెళ్లిపోతోంది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ ప్రస్తుతం మెయిన్ రోడ్డు ఎత్తు పెంచడం వల్ల వరద నీరంతా కాలనీల్లోకి చేరుతుంది. ఆ నీరు బయటకు పోకుండా కాలనీల్లోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే రోడ్డు నిర్మాణంలో భాగంగా సైడ్ డ్రైనేజీలు, ఫుట్​పాత్​లు నిర్మించాల్సి ఉంది. కానీ భారీ ఎత్తున వచ్చే వరదను తట్టుకోవాలంటే డ్రైనేజీ వ్యవస్థ పెద్దగా ఉంటే తప్ప సాధ్యం కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ ఇప్పుడు రోడ్లపై జరుగుతున్న కల్వర్టుల నిర్మాణంలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మోర్ మార్కెట్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టును రెండు భాగాలుగా విడగొట్టారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని మళ్లించాలంటే బాక్సు కల్వర్టు నిర్మించాలన్నది ఆర్ అండ్ బీ ప్లాన్. కానీ ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచనతో సిమెంట్ పైపుతో కల్వర్టు నిర్మిస్తున్నారు. దీ నికి ఆనుకుని తాగునీటి పైపులైన్ ఉంది. ఎప్పుడైనా పైపులైన్ రిపేర్లు చేయాల్సి వస్తే బాక్సు కల్వర్టు అయితే బెటర్ అని నిపుణులు చెపుతున్నా రు. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల సగం సిమెంట్ పైపులైన్, మిగితా సగం స్లాబ్ కల్వర్టు (బాక్సు కల్వర్టు) నిర్మిస్తున్నారు. వివేకానంద విగ్రహం వద్ద నిర్మించిన కల్వర్టు కింద బెడ్ ఎక్కువగా వేయడం వల్ల రోడ్డు ఎత్తు కంటే కల్వర్టు హైట్ పెరిగింది.

శాఖల మధ్య సమన్వయ లోపం

సీఎం కేసీఆర్ ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న పట్టణాభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పట్టణంలో మొత్తం రోడ్ల నిర్మాణాలకు అర్బన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 84 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్​చెందినవే. అయినప్పటికీ మున్సిపాలిటీ, పబ్లిక్​హెల్త్ కూడా ఈ పనుల్లో ఇన్వాల్వ్​అయింది. పనుల పర్యవేక్షణ ఆర్ అండ్ బీకి అప్పగించినట్లు పైకి చెబుతున్నా మొత్తం వ్యవహారం అంతా మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్ కంట్రోల్​లోనే నడుస్తోంది. ఈ మూడు డిపార్ట్​మెంట్ల మధ్య సమన్వయం లోపించింది. పైగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జోక్యం కూడా తలనొప్పిగా మారిందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంజినీరింగ్ ప్లాన్ కాకుండా ఎమ్మెల్యే ప్లాన్ ప్రకారం పనులు చేయాల్సి వస్తోందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది.