అచ్చే దిన్ తెస్తామని భారతదేశంలో 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. తరగని నిరుద్యోగం, అధిక ధరలు, పేపర్ లీకులు తప్ప ఏం జరిగిందని సామాన్యుడి కామెంట్. రూపాయి క్షీణత, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉగ్రవాదుల దాడులకు పరిష్కారాలేవి? ‘అభివృద్ధి’, ‘అచ్చే దిన్’, ‘ఉద్యోగాలు’, ‘నల్లధనం నిర్మూలనం’, ‘రైతు సంక్షేమం’ వంటి నినాదాలతో అధికారం చేపట్టారు. కానీ, ఏ ఒక్కదాంట్లో ముందడుగు మాత్రం కనిపించలేదు.
దేశంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, అంతర్జాతీయ గుర్తింపు వంటి కొన్ని రంగాల్లో పురోగతి సాధించామని చెబుతున్నప్పటికీ, సాధారణ ప్రజల జీవన వ్యయాలు, నిరుద్యోగం, ఫెడరల్ స్ఫూర్తి, మత సామరస్యం, అప్పులు, పన్నుల భారంపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ 12 సంవత్సరాల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధం కారణంగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రజలకు తీవ్ర ఆర్థికభారాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు రూ.400–500 మధ్య ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటుతోంది.
పెట్రోల్ ధరల ప్రభావం నేరుగా రవాణా ఖర్చులపై, ఆహార ధరలపై, సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చులపై పడింది. మధ్యతరగతి కుటుంబం నెల బడ్జెట్ నిర్వహించడం కష్టమైందనే అభిప్రాయం బలపడింది.
ఉద్యోగాల విషయంలో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు ఆలస్యం కావడం, ప్రైవేట్ రంగంలో స్థిరత్వం తగ్గడం వల్ల చదువుకున్న యువతలో నిరాశ పెరిగింది. పోటీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 12 ఏండ్లలో 24 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి, అయితే 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగాలు రావని నిరాశకు లోనైన యువకులు 2024లో ఒక్క ఏడాదిలోనే 14778 మంది ఆత్మ హత్యలకు పాల్పడడం నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తుంది. మరో వైపు పేపర్ లీకేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. పేపర్ లీకేజీలు సర్వసాధారణం అయిపోయింది.
జీఎస్టీ ప్రభావం
పన్నుల వ్యవస్థలో జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది. అయితే చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపార వర్గాలు మొదట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం కూడా చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని అనేక ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావలసిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్రం పెత్తనం రాష్ట్రాలపై పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నోట్ల రద్దు ఫలితమేది ?
దేశ సంపద కొంతమంది చేతుల్లో బందీ అయ్యింది, అంతరాలు, అసమానతలు పెరిగిపోయాయి. మొదటగా, ఆర్థికరంగంలో.. 2016లో జరిగిన నోట్ల రద్దు చర్య దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నిర్ణయం సకాలంలో సన్నద్ధత లేకుండా తీసుకోవడం వల్ల చిన్న వ్యాపారులు, కూలీలు, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నోట్ల రద్దు ప్రణాళిక ద్వారా బ్లాక్‌మనీని తగ్గిస్తామని భావించినప్పటికీ, ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. 2014లో రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 58.66 కాగా, ఇప్పుడు 96.95 కు చేరుకుంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆర్థికవ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఆర్థికవ్యవస్థ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కోకుండా ప్రజలపై భారం మోపిన ప్రధాని ప్రజలకు పొదుపు పాటించండి అని పిలుపు ఇవ్వడం విడ్డూరం.
అప్పుల భారత్
అప్పుల ఊబిలోకి చేరిన భారతదేశంలో ప్రతి పౌరునిపై 1.48 లక్షల అప్పు ఉంది. ఇప్పటివరకు ఎన్డీయే ప్రభుత్వం 191 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 17.20 లక్షల కోట్లు అప్పులు చేస్తామని ప్రకటించింది. 2014-15లో 62,78,553 కోట్ల రూపాయల అప్పు 2026-–27కు 2,08,72,510 లక్షల కోట్లకు చేరడం అప్పుల భారత్గా మారడం ఎన్డీఏ అచ్చేదిన్లో భాగమే.
వ్యవసాయంపై నిర్లక్ష్యం
భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధి. అయితే వ్యవసాయ సంక్షేమానికి సంబంధించి సరైన విధానాలు, మద్దతు లేకపోవడంతో రైతులు ఆందోళనలకు దిగారు. 2020లో తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులందరినీ అసంతృప్తిపరచి, విశేషంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ నిరసనలు ఏర్పడటానికి కారణమయ్యాయి. దీంతో కేంద్రం దిగివచ్చింది.
కానీ ఎరువులు, విత్త నాలు, డిజిల్ ధరలు పెరగడంతో సాగు ఖర్చు పెరిగింది. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడం వలన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుండడం ఆందోళన కలిగించే విషయం, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం రైతుల అప్పులు రెట్టింపు చేసింది. కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే శక్తి లేని దేశంగా మారడం విషాదం.
ఆయుష్మాన్ భారత్ సేవలు ఏమేరకు?
ఆరోగ్య రంగంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి సమయంలో సక్రమమైన ప్రణాళికల లోటు, వైద్య సదుపాయాల పరిమితి, సరైన సమాచార వ్యాప్తి లేకపోవడం వల్ల ప్రజలలో భయభీతి, అసౌకర్యాలు ఏర్పడ్డాయి.
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభంలో కొన్ని అర్ధం కాని విధానాల వల్ల ప్రజలు నిరాశ చెందారు. ఆరోగ్య రంగంలో మరింత పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల మూడవ తరగతి వైద్యసేవలు చాలా చోట్ల అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. ఆయుష్మాన్ భారత్ ఉన్నా అర్హులందరికీ వైద్య సేవలు అందుతున్నాయా?
సామరస్యత ఏది ?
మోదీ ప్రభుత్వం విధానాలు సమాజంలో వేరువేరు మతాల మధ్య విభేదాలను పెంచాయి. ఈ విభజనలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని అనిపిస్తోంది. సామరస్యాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విభిన్న సంస్కృతులు, అలవాట్లు ఉన్న దేశంలో ఒకే భాష, ఒకే తిండి, ఒకే విధానం అనే విధానం వికటించింది. మొత్తం మీద మోదీ ప్రభుత్వం కొన్ని కీలక రంగాలలో ఆశించినవిధంగా పనితీరు చూపలేదు. ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేకపోయింది.
దారి తప్పిన విదేశాంగ విధానం
ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దిగజారుతున్నది ఎందుకు? విదేశాంగ విధానం దారితప్పింది. అమెరికా అగ్రరాజ్యానికి భారతదేశం జీ హుజూర్‌గా మారింది అనే అభిప్రాయం బలపడింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కేంద్రాలపై దాడులు చేస్తే అమెరికా జోక్యం చేసుకొని యుద్ధ విరమణ ప్రకటించడం, భారత ప్రభుత్వం దిగుమతులు ఎక్కడి నుంచి చేసుకోవాలో నిర్దేశించడం దిగజారిన విదేశాంగ విధానానికి పరాకాష్ట.
రాబోయే మూడేళ్లే ప్రజాతీర్పుకు కీలకం
ఇటీవల సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరిట అకౌంట్ తెరిస్తే కోట్లాది మంది ప్రజలు స్పందించారు. నిరుద్యోగం, అవినీతి, అధిక ధరలు, కుంభకోణాలపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయలేని భావజాల వ్యాప్తి ఒక యువకుడు సోషల్ మీడియా ద్వారా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పటికైనా పాలకులు పారదర్శకత చాటుకోకపోతే ప్రజా పోరాటాలు తమ దారిని వెతుక్కుంటాయి అనే సహజ సూత్రాన్ని గమనించాలి. పుష్కరకాలం పాలన ప్రజలకు మేలు ఏ మేరకు జరిగింది? ఇకముందు జరుగుతుందనే ఆశలేవి? ఎన్డీఏ ప్రభుత్వానికి మరో మూడేళ్ల కాలముంది. రాబోయే మూడేళ్లలో ఎన్డీఏ పాలనా తీరే ప్రజాతీర్పుకు కొలమానంగా మారే అవకాశం ఎలాగూ ఉంటుంది!
దేవీప్రసాద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
