దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నిర్ణంయించింది. దీనిలో భాగంగా త్వరలో యాంటీ–డ్రోన్ సిస్టమ్‌లతో ఎయిర్ పోర్ట్స్ పటిష్ట భద్రతా వలయంలోకి రానున్నాయి. రోగ్ డ్రోన్ల ద్వారా ఎదురయ్యే దాడులను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ల ప్రభావవంతమైన వినియోగం తర్వాత పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఇప్పటి వరకు సైనిక స్థావరాలకే పరిమితమైన ఈ రక్షణ టెక్నాలజీని.. ఇప్పుడు మొదటిసారిగా పాసింజర్ ట్రాన్స్ పోర్ట్ సేవలు అందిస్తున్న విమానాశ్రయాల్లోనూ అమలు కానుంది. హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు జరుగుతోంది. సివిల్ ఏవియేషన్ భద్రతా బ్యూరో (BCAS) ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కమిటీలో డీజీసీఏ, సీఐఎస్ఎఫ్ వంటి సంస్థల ప్రతినిధులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా ఉన్నారు.
యాంటీ డ్రోన్ సిస్టమ్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ప్రస్తుతం సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ప్లాన్ ఫైనలైజ్ అయిన వెంటనే కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ దశల వారీగా అమలు చేయబడుతుంది. పస్ట్ ఫేజ్ కింద ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, జమ్ము వంటి సున్నితమైన ప్రాంతాల విమానాశ్రయాల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర విమానాశ్రయాలకు ఈ సాంకేతికతను విస్తరించనున్నారు.
దేశ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. 2025 ఏప్రిల్‌లో పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, దానికి అనుసంధానంగా జరిగిన భారత్–పాక్ సైనిక ఉద్రిక్తతల్లో డ్రోన్ల వినియోగం కీలకపాత్ర పోషించింది. భారత రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ లోకి ప్రవేశించకుండానే ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్లు నిర్వహించడం ఈ సాంకేతికత ప్రాధాన్యతను చూపించింది. అలాగే ఇటీవల పాకిస్తాన్ మూలాలు కలిగిన అనేక డ్రోన్లు భారత భూభాగంపై కనిపించగా, వాటిని భారత బలగాలు కూల్చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది దేశ భద్రతా దృష్ట్యా పెద్ద ముందడుగు అని నిపుణులు అంటున్నారు.
