పంద్రాగస్టుకు అవాంతరాలు రావొద్దు:డీజీపీ అంజనీకుమార్

పంద్రాగస్టుకు అవాంతరాలు రావొద్దు:డీజీపీ అంజనీకుమార్
  • గోల్కొండ కోటలో వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

మెహిదీపట్నం వెలుగు : చారిత్రక గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం డీజీపీ అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వేడుకలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా సంబంధిత శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ నెల 15న ఉదయం సీఎం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు.  లక్ష వాటర్ ప్యాకెట్లు, 25 వేల వాటర్ బాటిళ్లు రెడీగా ఉంచుతామని వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ తెలిపారు.  

ఎమర్జెన్సీ  వైద్యసేవలకు 4 అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని వైద్యశాఖ అధికారులు చెప్పారు. 3 ఫైర్ ఇంజన్లు , 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు సిద్ధంగా ఉంచుతామని ఫైర్ అధికారులు వివరించారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక జనరేటర్లు, వాటర్ ప్రూఫ్ షెడ్లను రెడీగా ఉంచుతామని విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు తెలిపారు. సీఎంకు దాదాపు 1200 మంది కళాకారులు స్వాగతం పలుకుతారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. 

వేడుకలను వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు. కోట పరిసర ప్రాంతాల్లో  పార్కింగ్ వివరాలను డీజీపీ అడిగి తెలుసుకోగా..  మొత్తం 1930 వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు.