ఆధ్యాత్మికం:  ద్వేషం.. హింస అంతా నష్టమే..  విదురనీతి మానవ జీవనానికి సోపానం..!

ఆధ్యాత్మికం:  ద్వేషం.. హింస అంతా నష్టమే..  విదురనీతి మానవ జీవనానికి సోపానం..!

‘‘ఒకరి మీద ద్వేషం, దాని కారణంగా వానిని జయించాలనీ, హింసించాలనీ అనుకోవడం దుఃఖ కారణం. అలాగే ఎదుటివారిని నిందించేవాడు కూడా శోకసంతుప్తుడవుతాడు. వీటికి అతీతంగా ఉంటే ఏ బాధా ఉండదు. సత్యవాక్పాలన, ఇంద్రియ విజయం, మృదు స్వభావం.. ఇవి ఉత్తమ పురుష లక్షణాలు. వాగ్దానంతో ఆగకుండా పని నెరవేర్చటం, నిష్కల్మష హృదయంతో సానుభూతి ప్రకటించడం, ఎదుటివారి దోషాలను గ్రహించటం.. మధ్యమ లక్షణాలు. నిరంతరం క్రోధంతో ఎవరికో ఒకరికి హాని తలపెడుతూ, కఠోరంగా దండించేవాడు అధముడు. స్నేహితుల వల్ల ఉపకారం లేదని.. వారిని దూరం చేసేవాడు అధమాధముడు. దుర్జన సాహచర్యంతో ధనం సంపాదించేవానిని సజ్జనులు హర్షించరు. 

సదాచారపరుడై తపస్సు, యజ్ఞకర్మలు నిర్వర్తిస్తూ, వివాహ బంధాన్ని లక్షణంగా కొనసాగిస్తూ, అన్నదానంతో దరిద్రులకు తృప్తి కలిగించేవాడు కులీనుడు, సజ్జనుడు అని వేదవేత్తలు చెబుతున్నారు. తల్లిదండ్రులకు కష్టం కలిగించకుండా ప్రసన్న చిత్తంతో ఉంటే ఉత్తముడు’’ అని ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి నీతి బోధ చేశాడు. 

ఉషశ్రీ భారతం ప్రకారం విదురనీతి మానవ జీవన సోపానానికి, వ్యక్తిత్వ వికాసానికి ఉత్తమమైనది. ఇది ఎల్లవేళలా అనుసరించదగినది.ఇక్కడ విదురుడు చెప్పిన అంశాలన్నీ దుర్యోధనుడికి వర్తించేవిగా కనిపిస్తాయి. నిరంతరం పాండవుల మీద ద్వేషం పెంచుకుంటూనే ఉన్నాడు. ఆ కారణంగానే వారిని ఏదో ఒకరకంగా జయించాలనుకున్నాడు. ఉత్తర గోగ్రహణానికి కారణం అదే. అలాగే రాయబారిగా వస్తున్న శ్రీకృష్ణుడిని పట్టి బంధిస్తానన్నాడు. 

బాల్యం నుండి పాండవులను హింసిస్తూనే వచ్చాడు. బాల్యక్రీడల సమయంలో తాళ్లతో బంధించి, నీళ్లలో పడేశాడు. అన్నంలో విషం కలిపించాడు. లక్క ఇల్లు నిర్మించి, అందులో వారిని కాల్చి చంపేయాలనుకున్నాడు. కపట ద్యూతం ఆడి, వారిని అడవులపాలు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, దుర్యోధనుడు చేసిన హింసకు అంతే లేదు. నిరంతరం పాండవులను, శ్రీకృష్ణుడిని ఏదో ఒకనెపంతో నిందిస్తూనే ఉన్నాడు.

►ALSO READ | ఘాజీ చరిత్ర.. 12 వ ఏట శత్రువులపై యుద్దం.. శాంతి భద్రతలకు పెద్దపీట

ఇన్ని అవలక్షణాల కారణంగానే అందరికీ శోకం మిగిల్చాడు. ఇది నాడే కాదు.. నేటికీ వర్తిస్తుంది. రాజకీయాలలో నిరంతరం ఒకరిని ఒకరు నిందించుకుటూ, దూషించుకుంటూ, హింసించుకుంటూ ప్రజాపాలనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ధనార్జనే ప్రథమ లక్ష్యంగా, పరదూషణే పరమావధిగా ఉండటం భారతంలో దుర్యోధనుడి దగ్గర నుండి కొనసాగుతూనే ఉంది.ఆనాడు విదురుడు చెప్పిన మాటలు నేటికీ శిరోధార్యమే. సక్రమ పాలన చేస్తూ, ప్రజలను రామునిలా కన్నబిడ్డల వలె పరిపాలించాలి అనుకునేవారికి విదురనీతి ఉత్తమం.

శ్రీకృష్ణదేవరాయలు తన దగ్గర మంత్రిగా పనిచేస్తున్న తిమ్మరసు సూచనలను తు.చ. తప్పకుండా అనుసరించాడు. మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి, సుపరిపాలన అందించడానికి చాణక్యుని సలహాలు.. చంద్రగుప్తునికి ఉపయోగపడ్డాయి. రాజులు ఏ పదవీ, సంపదలూ ఆశించని విదురుని వంటి నిస్వార్థమైన మంత్రులను తప్పనిసరిగా నియమించుకోవాలి. వారి మాటలను అనుసరించాలి. 

ప్రభువులైన వారు స్వార్థపరులను దూరంగా ఉంచాలి 

అనగనగా వంగ, కళింగ అని రెండు రాజ్యాలు ఉన్నాయి. వంగ దేశాన్ని ఆనంద వర్థనుడు, కళింగ దేశాన్ని విష్టు వర్థనుడు పరిపాలించేవారు. వీరిరువురు స్వయంగా అన్నదమ్ములే. ఆనంద వర్థనుడికి ప్రజాశ్రేయస్సే ప్రధాన లక్ష్యం. అందుకోసం శాస్త్రజ్ఞానం తెలిసిన ఎనిమిది మంది మంత్రులను నియమించుకున్నాడు. వారి సలహాలు, సూచనలను అనుసరించి చక్కటి పరిపాలన అందిస్తూ, ‘ఈ ప్రభువు పాలన రామరాజ్యంలా ఉంది’ అనిపించుకున్నాడు.

 విష్ణు వర్థనుడు ధనార్జనే ప్రథమ కర్తవ్యంగా... నలుగురు మూర్ఖులైన మంత్రులను నియమించుకున్నాడు. వారు నిరంతరం రాజు చేస్తున్న ప్రతి అరాచకాన్ని పొగుడుతూ, అక్రమంగా ధనం సంపాదించే మార్గాన్ని సూచిస్తూ వచ్చారు. అనతి కాలంలోనే విష్ణు వర్థనుడు కోట్లకు పడగలెత్తాడు.

 ఆనంద వర్థనుడు మాత్రం మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు సాగింది. కొంతకాలానికి విష్ణు వర్థనుడి రాజ్యంలోని ప్రజలు తిరుగుబాటు చేశారు. విష్ణు వర్థనుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు పారిపోయాడు.

మంత్రులు సైతం రాజును అనుసరించారు. అప్పుడు ప్రజలంతా ఆనంద వర్థనుడిని తమకు రాజుగా ఎన్నుకున్నారు. రెండు రాజ్యాలను ఆనంద వర్థనుడు తన రెండు కళ్లుగా భావించి, సుపరిపాలన అందించాడు. అన్యాయం ఎంతో కాలం కొనసాగదు. న్యాయం, ధర్మమే చిరస్థాయిగా నిలబడతాయి. ధర్మానికి కొంత కాలం విఘాతం కలిగినా, శాశ్వతంగా నిలబడేది మాత్రం ధర్మమే.