ఘాజీ చరిత్ర.. 12 వ ఏట శత్రువులపై యుద్దం.. శాంతి భద్రతలకు పెద్దపీట

ఘాజీ చరిత్ర.. 12 వ ఏట శత్రువులపై యుద్దం.. శాంతి భద్రతలకు పెద్దపీట

బాబరు క్రీ.శ1482లో జన్మించాడు. అందగాడు, విలువిద్యలో నేర్పరి. పోలో ఆటలో నైపుణ్యం గలవాడు. మంచు పర్వత ప్రవాహంలోకి దూకి ఈదేవాడు. సమర్ఖండ్ కోట బురుజుల వెంట పరిగెత్తేవాడు. తన చిన్నతనంలోనే తండ్రి షేక్ ఉమర్ చనిపోయాడు. వెంటనే అరాచకం ప్రబలింది. దీంతో బాబరు పారిపోవాల్సి వచ్చింది. 

మూడు సంవత్సరాల తర్వాత అంటే అతని 12వ ఏట తిరిగి వచ్చి శత్రువులను పారదోలి శాంతి భద్రతలను నెలకొల్పాడు. సమర్ఖండ్​ కొద్దికాలం వరకే ఆయన చేతుల్లో ఉంది. ఒకసారి ఆయన ఏదో దండయాత్రలో ఉండగా శత్రువులు నగరాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో ఆయన మరొకసారి దేశ బహిష్కరణకు గురైనట్లైంది. ఆ తర్వాత మూడేండ్లు దేశమంతా తిరిగి1500 సంవత్సరంలో ఆయన సమర్ఖండ్ మీదికి మొత్తం 240 మంది అనుయాయులతో దాడి చేశాడు. కొందరు కోటపైకి ఎక్కి తలుపులు తెరిచారు. 

కేవలం కొద్దిమంది మాత్రమే జరిగిందేమిటో తొంగి చూసి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. త్వరలోనే ఆ వార్త అంతటా వ్యాపించింది. రాచతోరణం కింద సింహాసనం మీద ఆ యువరాజును, అతని తండ్రి, తాతల అందమైన భవంతి దగ్గర కూర్చోబెట్టారు. అది పొదలు, ఆహ్లాదకరమైన తోటలతో నిండి, చెంఘీజ్ ఖాన్ దాడుల చిత్రాలతో అలంకరించి ఉంది. కానీ ఆయన విజయం కొద్దికాలం వరకే నిలిచి ఉంది. మరుసటి ఏడాదిలోనే ఉజ్జెకు చెందిన గొప్ప ఖాన్​ షాహీబేగ్​ ఆయనను వెళ్లగొట్టడానికి సిద్ధమయ్యాడు. 

శత్రువు సవాల్​ను అంగీకరించడంతో ఆ శత్రువు తన సైన్యాన్ని ముందుకు నడిపించాడు. దాంతో ఆయన ఎక్కడో నగర గోడల మధ్య తలదాచుకునేలా చేశాడు. సమర్ఖండ్ చుట్టూ ముట్టడి జరిగి నగరవాసులలో బీదవాళ్లకు తిండి దొరకలేదు. గుర్రాలైతే చెట్టుకొమ్మలు, ఆకులు మేయాల్సి వచ్చింది. ఎక్కడినుంచీ సాయం అందలేదు. కానీ, ఆయన మానసిక స్థైర్యాన్ని ఏవీ దెబ్బతీయలేకపోయాయి. 

కొద్దికాలం తర్వాత తన అనుయాయులతో రెండేండ్లు దేశమంతా తిరుగుతూ పశువుల కాపరులతో, రైతులతో స్వేచ్ఛగా కలిసిపోయాడు. వాళ్లు ఎల్లప్పుడూ ఆయనకు ఆతిథ్యము ఇచ్చేవాళ్లు. అది ఆయన ఇష్టపడిన జీవితం. సమర్ఖండ్​ని స్వాధీనం చేసుకోలేనని తేలిపోయాక, బరువెక్కిన హృదయంతో దక్షిణదిశగా పయనమయ్యాడు. 

1504లో బాబరు కాబూల్​ని ఆక్రమించాడు. తన కొత్త రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు. 1525లో హిందుస్థాన్​పై యుద్ధంలో ఓడిపోయాడు. 1527లో వేగులు, శత్రువులు సమీపిస్తున్నారనే సమాచారం తెలిసింది. బాబరు వెంటనే తనవారిని మూడు భాగాలుగా చేశాడు. ముట్టడి మొదలైంది. చివరికి రాజపుత్రులు లొంగిపోయారు. వాళ్లను శిబిరాల నుంచి తరిమికొట్టారు.

 బాబరు ‘ఘాజీ’ (పవిత్ర యుద్ధ విజేత) అనే బిరుదుపొందాడు. ఆ తర్వాతి సంవత్సరంలో ఉస్తాద్ అలీ ఫిరంగి దళ సాయంతో ఛందేరిని ఆక్రమించుకోవడం జరిగింది. అప్పుడు బాబరు బీహార్​, బెంగాల్​లలోని స్వతంత్ర ఆఫ్ఘన్​ రాజ్యాలపై దాడులు చేశాడు. ఆ ఏడాదికల్లా ఆయన హిందుస్థాన్ అధిపతి అయ్యాడు. కానీ ఆయన ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఎంతోకాలం బతకలేదు. జబ్బుపడి1530లో మరణించాడు. 

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-