-శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : డీజీపీ సీవీ ఆనంద్‌‌

-శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : డీజీపీ సీవీ ఆనంద్‌‌

 

  • బక్రీద్ బందోబస్తుపై డీజీపీ సీవీ ఆనంద్‌‌ సమీక్ష 
  • సీపీలు, ఎస్పీలు, వివిధ శాఖాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్‌‌, వెలుగు:  బక్రీద్‌‌ పండుగను పురస్కరించుకుని పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌‌ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు డీజీపీ బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్​మెంట్ స్పెషల్ సీఎస్  జయేశ్ రంజన్, పశుసంవర్ధక శాఖ సెక్రటరీ ఇలంబర్తి తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ మాట్లాడుతూ.. సీఎం స్థాయిలో జరిగిన చర్చలు, అనంతరం ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశ నిర్ణయాలను వెల్లడించారు. ఈ నెల 27న జరిగే బక్రీద్​సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌‌ఓపీ)  అమలు కోసమే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 52  చెక్‌‌ పోస్టులు

పశువుల రవాణా విషయంలో కౌ స్లాటర్ యాక్ట్-1977, ట్రాన్స్‌‌పోర్ట్ యాక్ట్-1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ-1960 చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఛత్తీస్‌‌గఢ్‌‌, కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ సరిహద్దుల్లో 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.

పశువుల రవాణాపై ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప, నేరుగా రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు రెండు వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. సీజ్ చేసిన పశువులను సంరక్షించేందుకు తగిన విస్తీర్ణంలో క్యాటిల్ పాండ్‌‌లను ఏర్పాటు చేయాలన్నారు.