మావోయిస్టుల్లో మిగిలింది ముగ్గురే..గణపతి, వార్త శేఖర్, జోడె రత్నాభాయ్‌‌‌‌‌‌‌‌ లొంగిపోవాలి: డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌

మావోయిస్టుల్లో మిగిలింది ముగ్గురే..గణపతి, వార్త శేఖర్, జోడె రత్నాభాయ్‌‌‌‌‌‌‌‌ లొంగిపోవాలి: డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌
  • గణపతి దేశంలోనే ఉన్నాడు.. జనజీవన స్రవంతిలో కలవాలి
  • లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలా ఆదుకుంటున్నాం
  • డీజీపీ ఎదుట పసునూరి నరహరి, మేదర దానమ్మ లొంగుబాటు
  • దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేకనే సరెండర్: నరహరి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి  చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) సహా మిగిలిన ముగ్గురు మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. గణపతి విదేశాల్లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన ఎక్కడ ఉన్నారనే దానికి కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, దేశంలోనే ఏదో ఒక చోట ఉండి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. .

గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న జోడె రత్నబాయి అలియాస్‌‌‌‌‌‌‌‌ సుజాత, వార్త శేఖర్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ మంగ్తులు కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అండర్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 47 మంది మావోయిస్టులు ఉండగా, తెలంగాణకు చెందిన ఈ ముగ్గురు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో మిగిలిపోయారని  వివరించారు.మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌తో పాటు లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీజీ మహేశ్‌‌‌‌‌‌‌‌ భగవత్‌‌‌‌‌‌‌‌, ఇంటెలిజెన్స్ అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీజీ విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ ఇంచార్జి కార్తీకేయలు పాల్గొన్నారు.

మావోయిస్టు సెంట్రల్‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యుడు, బీహార్‌‌‌‌‌‌‌‌-జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్‌‌‌‌‌‌‌‌ విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌, ఆయన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్‌‌‌‌‌‌‌‌ లత డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ ఇద్దరి పేరిట ఉన్న రూ.45 లక్షల రివార్డు మొత్తానికి సంబంధించిన రెండు డీడీలను డీజీపీ వారికి అందజేశారు. గత రెండేళ్ల వ్యవధిలో మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తి భరోసా

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వారు తిరిగి పాత భావజాలం వైపు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నచ్చిన పనులలో నైపుణ్యం పెంచేందుకు చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ తరహాలో రాష్ట్రంలో కూడా ఒక 'స్కిల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

లొంగిపోయిన వారి జీవనోపాధి, ఆరోగ్యం, నిత్యావసరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మలేరియాతో బాధపడుతున్న నరహరి, దానమ్మలకు ఇప్పటికే వైద్యం అందించామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సదుపాయాలను చూసే వీరిద్దరూ లొంగిపోయారని తెలిపారు. త్వరలోనే తాను జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లాతో పాటు మాజీ మావోయిస్టులు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి, వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలిస్తానని డీజీపీ వెల్లడించారు.

ఆయుధ డంపులను వెలికితీస్తం

మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ పూర్తిగా అప్పగించలేదని భావిస్తున్నామని, మిగిలిన ఆయుధాలు, బాంబులు, డంపుల వెలికితీత కోసం వేట కొనసాగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. లొంగిపోయిన వారి స్థితిగతులను స్థానిక పోలీసుల నుంచి జిల్లా ఎస్పీలు, సీపీల వరకు నిరంతరం గమనిస్తూనే ఉంటారని చెప్పారు. ఒక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకారం పునరావాస కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటామన్నారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్రంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ, గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌ విభాగాలను యథావిధిగా కొనసాగిస్తామని, అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య కొంత తగ్గొచ్చని వివరించారు.

పరిస్థితులు అనుకూలంగా లేకనే లొంగుబాటు: నరహరి

దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ తీవ్ర నష్టాలను చవిచూసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం చేయడం కష్టతరంగా మారిందని లొంగిపోయిన అగ్రనేత పసునూరి నరహరి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలు నచ్చడం వల్లే తాము జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు చెప్పారు. మావోయిస్టు పొలిట్‌‌‌‌‌‌‌‌ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు మిసిరిబిస్రా నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తాము లొంగిపోయామని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేనందున అజ్ఞాతంలో ఉన్న గణపతి, మిసిరిబిస్రా వంటి వారు కూడా ప్రభుత్వం వద్ద లొంగిపోయి మెయిన్‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని నరహరి కోరారు.

ఆయుధాల తయారీలో నరహరి నిపుణుడు

హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూ వైపు ఆకర్షితులయ్యారు. 1982లో పీపుల్స్‌‌‌‌‌‌‌‌వార్‌‌‌‌‌‌‌‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. 1986లో దండకారణ్యంలోని రామన్న దళంలో పనిచేశారు. 1988 నుంచి 1990 వరకు బెంగళూరులో పులి అంజయ్య 'డెన్ కీపర్'గా, ఆ తర్వాత ఆయుధాల సప్లై టీంలో సేవలందించారు.

1997లో చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ టెక్నికల్ టీంలో చేరి క్రమంగా ఎదిగిన నరహరి.. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, రాకెట్ ఆధారిత గ్రెనేడ్ల (ఆర్పీజీ) తయారీలో ఈయనకు అపారమైన నైపుణ్యం ఉంది. ఆయుధాల ఉత్పత్తి, మరమ్మతులపై మావోయిస్టు కార్యకర్తలకు ఈయనే శిక్షణ ఇచ్చేవారు. ఈయన భార్య మేదర దానమ్మ ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గుంటూరు జిల్లాకు చెందినవారు కాగా, ఆమె 1986 నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి వచ్చారు.