
- ..అత్యుత్తమ పనితీరుకు రివార్డులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసు శాఖ దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నదని డీజీపీ జితేందర్ తెలిపారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. నేర విచారణ, నేర గుర్తింపు, తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 52 మంది పోలీసు సిబ్బందికి డీజీపీ ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, తెలంగాణ పోలీసు శాఖ దేశంలో మొదటి స్థానం సాధించిందని వెల్లడించారు. అలాగే, సెల్‌ఫోన్ రికవరీలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
పోలీసు సిబ్బంది అసాధారణ పనితీరు శాఖ విజయానికి గణనీయంగా దోహదపడిందని చెప్పారు. ఈ 52 మంది ప్రశంసలు, ప్రోత్సాహానికి అర్హులని వెల్లడించారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ మాట్లాడుతూ..2024లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 52 మంది అధికారులను పలు విభాగాల కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పౌరుల అభిప్రాయ సేకరణ ద్వారా (క్యూఆర్ కోడ్ సహా) అత్యధిక రేటింగ్ పొందిన హైదరాబాద్, మెదక్, రామగుండం వంటి టాప్ 3 యూనిట్లు , టాప్ 10 పోలీస్ స్టేషన్లకు కూడా ఈ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్ రెడ్డి, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, అనిల్ కుమార్, ఐజీలు ఎం. రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి, రమేశ్ నాయుడు, శ్రీనివాస్, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, సీఐడీ ఎస్పీ శ్రీనివాస్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.