
- ఫస్ట్ మీ నాన్నతో అమలు చేయించు
- ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అర్వింద్ సవాల్
- కేబినెట్లో 33% మహిళలకు చాన్స్ ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్ల పేరుతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తండ్రి కేసీఆర్‌తో ముందు మహిళా రిజర్వేషన్ అమలు చేయించాలన్నారు. సిట్టింగ్‌లకే కేసీఆర్ టికెట్లు ఇస్తామన్నారని, మరి 33% రిజర్వేషన్ ఎటు పోతుందని ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్, 119 అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్‌తో స్టేట్మెంట్ ఇప్పించాలని సవాల్ విసిరారు. ఆ తర్వాత ఢిల్లీలో రౌండ్ టేబుల్ మీటింగ్‌లు, దీక్షలు, సర్కస్ లు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో అర్వింద్ మాట్లాడారు. ‘‘ఓ పక్క కవిత లింగ సమానత్వం అంటున్నరు. ఈడీ విచారణలో మహిళలకు మినహాయింపు కోసం కోర్టుకు ఎందుకు వెళ్లినట్లు మరి. ఫస్ట్ ఈ మ్యాటర్లో క్లారిటీ తెచ్చుకోవాలి”అని అర్వింద్ విమర్శించారు. కవితను ఈడీ విచారిస్తున్నప్పుడల్లా మంత్రులు ఢిల్లీకి రావొద్దని సూచించారు. అక్కడే ఉండి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఫేస్ రికగ్నేషన్ కెమెరాలున్నాయని, ప్రపంచంలోని అన్ని కెమెరాలతో లింక్ అయి ఉంటాయన్నారు. అప్పుడు మంత్రులు ఎక్కడికెళ్లినా తెలిసిపోతుందని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థ నజర్లో వచ్చి ప్రశ్నిస్తే.. నాకు తెలీదు, నాకు గుర్తు లేదనే సమాధానాలు ఇవ్వొద్దని ఎద్దేవా చేశారు. ఈడీ విచారణ ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలికిన మంత్రి కేటీఆర్.. తన చెల్లి ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఎల్ సంతోష్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కి లేదన్నారు.
అహంకారంతోనే వీ6, వెలుగుపై బ్యాన్
అహంకారంతోనే కల్వకుంట్ల కుటుంబం వీ6, వెలుగుపై బ్యాన్ విధించిందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు పోకపోతే ఏం కాదని అన్నారు. తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కేసీఆర్ అహంకారాన్ని చూస్తున్నారని తెలిపారు. ఈ అహంకారానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఓటు వేయబోతున్నదన్నారు. అప్పుడు బీఆర్ఎస్ లీడర్ల నెత్తికెక్కిన కళ్లు భూమ్మీదికి వస్తాయని ఎద్దేవా చేశారు.