యాదాద్రి, వెలుగు: ధర్మారెడ్డి కాలువ పునరుజ్జీవ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం సంగెం-ధర్మారెడ్డిపల్లి-గోకారం పరిధిలో రూ.124 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను ఆయన బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధర్మారెడ్డి కాలువ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. రైతుల కోసం ఆలోచించే తమ ప్రభుత్వం ఈ కాలువ కోసం నిధులు విడుదల చేసిందని తెలిపారు.
రూ. 2.75 కోట్లతో గోదాముల నిర్మాణం
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో రూ. 2.75 కోట్లతో నిర్మించే 2500 టన్నులు సామర్థ్యం గల గోదాముల నిర్మాణ పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వడ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను స్టోరేజీ కోసం ఇబ్బందులు కలగకుండా గోదాములు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
