- రూ. 1.81 లక్షల కోట్ల అప్పు తెచ్చి ప్రాజెక్టును ముంచారు
- బీఆర్ ఎస్ ఖాతాలో జమ అయినట్లు కవిత చెబుతున్న..
- రూ. 1400 కోట్ల లెక్కేంది ? : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట/హుజూర్ నగర్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రూ. 1.81 లక్షల కోట్ల అప్పుతో కట్టిన ఈ ప్రాజెక్ట్... బీఆర్ఎస్ హయాంలోనే దెబ్బతిందని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శుక్రవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు రైతాంగం ఇబ్బంది పడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ పై జాతీయ సంస్థలు అప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశాయన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నుంచి చుక్క నీటిని కూడా వదిలే పరిస్థితి లేదని, నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయి భద్రాచలం పట్టణంతో పాటు పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారని చెప్పారు.
కాళేశ్వరం కట్టిన కంపెనీల నుంచి రూ. 1,400 కోట్లు బీఆర్ ఎస్ పార్టీ ఖాతాలో జమ అయినట్లు కేసీఆర్ కుమార్తె కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నిందను కాంగ్రెస్ మీద నెట్టాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
హరీశ్ రావుకు అంత పరిజ్ఞానం ఎక్కడిది ?
'హరీశ్ రావు ఇప్పుడు పెద్ద ఇంజినీరులా మాట్లాడుతున్నారు, నీటి పారుదలపై ఆయనకు అంత పరిజ్ఞానమే ఉంటే.. ఆ శాఖను మొదట ఆయనకు ఇచ్చిన కేసీఆర్ తర్వాత ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పడంలో బీఆర్ ఎస్ నాయకులు సిద్ధహస్తులని, కానీ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారన్నారు.
రాజకీయ విమర్శల కంటే శాస్త్రీయ పరిష్కారాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేయిస్తున్నామని, వచ్చే వేసవి నాటికి పనులన్నీ పూర్తి చేసి, వానాకాలం నాటికి రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చామన్నది పచ్చి అబద్ధమని, గతంలో వర్షాలు బాగా పడటం వల్ల ఎస్సారెస్పీ స్టేజ్-2 ద్వారానే నీళ్లు వచ్చాయని చెప్పారు.
