పర్యాటక ప్రాంతంగా ధర్మసాగర్ రిజర్వాయర్​

పర్యాటక ప్రాంతంగా ధర్మసాగర్ రిజర్వాయర్​
  • రూ.4.09 కోట్లతో అభివృద్ధి చేయనున్న ‘కుడా’
  • ప్రపోజల్స్ రెడీ చేసిన ఆఫీసర్లు
  • త్వరలోనే పనులు ప్రారంభం
  • రిజర్వాయర్​ను పరిశీలించిన ఎమ్మెల్యే, కుడా చైర్మన్, బల్దియా కమిషనర్

ధర్మసాగర్, వెలుగు: ఎంతో చరిత్ర కలిగిన ధర్మసాగర్ రిజర్వాయర్​ను  టూరిస్ట్ స్పాట్​గా తీర్చిదిద్దేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఎత్తైన కొండతో ఈ రిజర్వాయర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వరంగల్ సిటీకి కూడా అతి సమీపంలో ఉండడంతో ఈ రిజర్వాయర్​ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ ‘కుడా’ పరిధిలో ఉండగా.. ఆ సంస్థ నుంచే రూ.4.09కోట్ల నిధులు కేటాయించనున్నారు. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్, వరంగల్ బల్దియా కమిషనర్ ప్రావీణ్య రిజర్వాయర్​ను పరిశీలించి, చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు.

ఘనమైన చరిత్ర..

సీతారామలక్ష్మణులు వనవాసం వెళ్లే క్రమంలో ధర్మసాగర్ లో సేద తీరానని ప్రతీతి. ఇక్కడి రిజర్వాయర్ మధ్యలో పాండవుల గుట్ట టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్రికూఠాలయం, ఇనుపరాతి గుట్టలు సైతం దీని పక్కనే ఉన్నాయి. అంతేకాక ఈ చెరువు గత ముప్పై ఏండ్లుగా వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చుతోంది. గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు కింద ఈ చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​గా అభివృద్ధి చేశారు. మొత్తం 1.5 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా తీర్చిదిద్దారు. ప్రజలకు తాగు నీటితో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 50వేల ఎకరాలకు ఈ రిజర్వాయర్ సాగు నీరు అందిస్తోంది.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..

ధర్మాసాగర్​రిజర్వాయర్ ను మంచి టూరిస్ట్ స్పాట్​గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఇదే అతి పెద్ద రిజర్వాయర్ అని తెలిపారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే ప్రజలకు జీవనోపాధి కూడా దొరుకుతోందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​రజిని, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల ఆఫీసర్లు ఉన్నారు.

చేపట్టే పనులివే..

ధర్మసాగర్ రిజర్వాయర్​లో రూ.4.09కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టనున్నారు. రూ.1.99కోట్లతో రిజర్వాయర్ చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. రూ.1.30కోట్లతో ఎల్ ఈడీ లైట్లతో పాటు జిగేలుమనిపించే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల ఆటవస్తువుల కోసం రూ.50లక్షలు కేటాయించారు. బెంచీల కోసం రూ.5లక్షలు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.25లక్షలు అలాట్ చేశారు.