ఈ సినిమా నాకో పెద్ద ట్రీట్

ఈ సినిమా నాకో పెద్ద ట్రీట్

ఏ సినిమా చేసినా దానికో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు కార్తి. రీసెంట్‌గా ‘ఖైదీ’గా వచ్చి మెప్పించాడు. ఈ నెల 20న ‘దొంగ’గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఇలా ముచ్చటించాడు.

ఇండస్ట్రీకొచ్చి పదమూడేళ్లయినా ఇప్పటి వరకూ పంతొమ్మిది సినిమాలే చేశాను. టైముంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయను. కథ నచ్చితేనే కమిటవుతాను. ఒక సినిమాలో చేసిన తప్పులు తర్వాత తీసే సినిమాలో చెయ్యకూడదనుకుంటాను. అందుకే ప్రతిదీ విశ్లేషించుకుని సాధ్యమైనంత వరకూ తప్పుల్ని సరిదిద్దుకుంటాను.

‘ఖైదీ’ వచ్చాక ఈ సినిమా రిలీజవుతోంది కానీ నిజానికి ఈ సినిమా చెయ్యాలన్న నిర్ణయం మాత్రం రెండు సంవత్సరాల క్రితానిదే. జీతూ జోసెఫ్​గారి  డేట్స్​ కోసం వెయిట్ చేశాం. ‘రంగ్ దే బసంతి’ స్క్రిప్టు రాసిన రెన్సిల్ డిసిల్వా ఈ స్టోరీ లైన్ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. రెండు గంటల నెరేషన్ వినగానే మా వదిన, నేను ఈ కథ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత జీతూ జోసెఫ్ గారికి కథ వినిపించడం, ఆయనకు కూడా నచ్చడంతో మొదలుపెట్టాం.

ఈ కథకు తంబి లేదా తిరుడా అనే టైటిల్స్ మాత్రమే సూటవుతాయి. తమిళంలో మాకు ‘తిరుడా’ టైటిల్ దొరకలేదు. అందుకే అక్కడ ‘తంబి’ అని ఇక్కడ ‘దొంగ’ అని పెట్టాం. దానికి తగ్గట్టే నేను దొంగని. అయితే ఒక దొంగ తన ఫ్యామీలీ కోసం మంచి వ్యక్తిగా ఎలా మారాడు, ఆ క్రమంలో అతని జర్నీ ఎలా సాగిందన్నదే కథ.

ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్. రొమాన్స్ కొంచెం తక్కువ ఉన్నా.. కామెడీ, స్ట్రాంగ్ ఎమోషన్స్​తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా చెయ్యడం నాకో ట్రీట్. ఎందుకంటే మా వదినతో పాటు సీత, సత్యరాజ్, షావుకారు జానకి లాంటి సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించాను. అక్కగా జ్యోతికతో నటిస్తున్నప్పుడు కొత్తగా ఏమీ అనిపించలేదు. ఏదో ఇంట్లో సీన్స్​లా అనిపించాయి. సినిమాలో ముందు మా ఇద్దరికీ పడదు. తర్వాత ఫ్రెండ్స్ అయిపోతాం.

జీతూ జోసెఫ్​గారు హిచ్​కాక్​లా అనిపిస్తారు. ట్విస్ట్​లకు తగ్గ లాజిక్​ని ఎంచుకుంటారు. ఆయనకి ఆడియన్స్ అంటే చాలా అభిమానం. వాళ్లకి నచ్చే విధంగానే సినిమా తియ్యాలనుకుంటారు. పక్కా ప్లానింగ్​తో పని చేస్తారు. వర్షం కురుస్తున్నా షూటింగ్ ఆపరు. 65 రోజుల్లో ఒక్కరోజు, ఒక్క గంట కూడా వేస్ట్ కాకుండా షూటింగ్ చేశారాయన. ఇలాంటి అనుభవం నాకింతవరకూ కలగలేదు.

నాగార్జున గారు నాతో ఎప్పుడూ ఒక మూస పద్ధతిలో సినిమాలు చెయ్యకూడదు, ఎక్స్​పెరిమెంటల్​ మూవీస్ చెయ్యాలి అంటుంటారు. అలాగే ఎంతోమంది కొత్త డైరెక్టర్లను ఆయన తెలుగు తెరకి పరిచయం చేశారు. అందుకే ఆయన  నాకు మంచి ఇన్​స్పయిరింగ్​ పర్సన్.

ప్రస్తుతం మణిరత్నం గారు తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్​లో ఉన్నా. ప్రమోషన్స్ కోసం ఇక్కడికొచ్చాను. టైమ్ వచ్చినప్పుడు, మంచి స్క్రిప్టు దొరికినప్పుడు మా అన్నయ్య సూర్యతో కలిసి ఒక సినిమా చేస్తాను.