IND vs SA: దుమ్ములేపుతున్న జురెల్.. సౌతాఫ్రికా-ఏ పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల మోత

IND vs SA: దుమ్ములేపుతున్న జురెల్.. సౌతాఫ్రికా-ఏ పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల మోత

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. సౌతాఫ్రికా-ఏ తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలతో చెలరేగాడు. శనివారం (నవంబర్ 8) మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో  జురెల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత జట్టు రెండు ఇన్నింగ్స్ ల్లో కష్టాల్లో ఉన్నప్పుడు జురెల్ తన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 116 పరుగులకే 5 వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును జురెల్ నిలబెట్టాడు. హర్ష దూబేతో కలిసి ఆరో వికెట్ కు 184 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. 

ప్రస్తుతం జురెల్ 125 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. జురెల్ సెంచరీతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (65), జురెల్ (126) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 415 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అట ఒక రోజే మిగిలి ఉండడంతో ఇండియా-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. జురెల్  బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడంతో సౌతాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్ లో భారత ప్లేయింగ్ 11 లో చోటు దాదాపు కన్ఫర్మ్ అయింది. సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరగబోయే తొలి టెస్టులో వికెట్ కీపర్ గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.    

ALSO READ : రిషబ్ పంత్ గాయంపై ఆందోళన..  

తొలి ఇన్నింగ్స్ లోనూ సెంచరీ:
 
తొలి రోజు ఆటలో భాగంగా గురువారం (నవంబర్ 6) తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. జట్టు మొత్తం విఫలమైనా ఒక్కడే సెంచరీతో పోరాడి జట్టును ఆదుకున్నాడు. 175 బంతుల్లో 132 పరుగులు చేసి జట్టు మొత్తం స్కోర్ లో సగం పరుగులు చేశాడు. జురెల్ ఇన్నింగ్స్ తో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా-ఏ 255 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జురెల్ తుది జట్టులో స్థానం సంపాదించి తనను తాను నిరూపించుకున్నాడు. పంత్ గాయం నుంచి  కోలుకొని సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ఎంపిక కావడంతో జురెల్ మరోసారి బెంచ్ కు పరిమితమనుకున్నారు. అయితే సూపర్ ఫామ్ లో ఉండడంతో జురెల్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.