దినేష్ కార్తిక్, ఆండీ ఫ్లవర్‌లతో హార్దిక్ పాండ్యా భేటీ.. ఆర్‌సీబీలోకి ట్రేడ్పై చర్చ 

దినేష్ కార్తిక్, ఆండీ ఫ్లవర్‌లతో హార్దిక్ పాండ్యా భేటీ.. ఆర్‌సీబీలోకి ట్రేడ్పై చర్చ 

Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్‌లో RCB వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న కొద్దిరోజులకే ఒక ఆసక్తికరమైన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌తో కలిసి ఒక రెస్టారెంట్‌లో కలిసి ఉన్నట్లు కనిపిస్తుండటంతో, హార్దిక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి మారబోతున్నాడా అనే చర్చ నెటిజన్లలో జోరందుకుంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఈ పిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తరపున చివరి మ్యాచ్ ఆడినప్పటి హార్దిక్ హెయిర్‌స్టైల్‌కు, ఈ ఫోటోలోని హెయిర్‌స్టైల్‌కు చాలా తేడా ఉంది.

హార్దిక్ పాండ్యా ఎక్కడున్నాడు?: 
ఈ ఫోటో అహ్మదాబాద్‌లో జరిగిన భేటీకి సంబంధించినదిగా ప్రచారం జరుగుతుంది. మే 31న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత ఆర్‌సీబీ టీమ్ జూన్ 1వ తేదీ వరకు అక్కడే సంబరాల్లో మునిగిపోయింది. అహ్మదాబాద్ హార్దిక్‌కు హోమ్ టౌన్ అయినప్పటికీ, ఆ సమయంలో అతను భారతదేశంలోనే లేడు.. పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహిమా శర్మతో కలిసి ఫ్రాన్స్ టూర్‌ వెళ్లాడు, దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. మే 24న ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ముగిసిన వెంటనే హార్దిక్ విదేశాలకు వెళ్ళిపోయాడు. ఈ విందు, ఆటగాళ్ల బదిలీపై అటు ఆర్‌సీబీ కానీ, ఇటు ముంబై మేనేజ్‌మెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ గుడ్‌బై?: 
ఈ వైరల్ ఫోటో ఫేక్ అయినప్పటికీ, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (MI) జట్టును వీడటం మాత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై గత మూడు సీజన్లలో రెండు సార్లు ప్లేఆఫ్స్ (టాప్-4) కు చేరుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 లో కూడా జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న వెంటనే, తాను జట్టును వీడాలనుకుంటున్నట్లు హార్దిక్ మేనేజ్‌మెంట్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. ముంబై ఫ్రాంచైజీ కూడా రాబోయే సీజన్ లో కెప్టెన్సీ మార్పు వైపు మొగ్గు చూపుతోంది.

రేసులో చెన్నై సూపర్ కింగ్స్?: 
ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్న హార్దిక్ పాండ్యా తదుపరి ప్రయాణం ఎటువైపు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హార్దిక్ స్వయంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు, ఆ దిశగా చర్చలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫ్‌ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ (బదిలీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారే ఛాన్స్ ఉంది. ఈ రేసులోకి భవిష్యత్తులో ఆర్‌సీబీ కూడా వస్తుందో లేదో అనేది వేచి చూడాలి.