యుద్ధం రష్యా ప్రారంభించలేదు.. మా లక్ష్యాలు నేరవేరితే వార్ ఆపేస్తాం: పుతిన్

యుద్ధం రష్యా ప్రారంభించలేదు.. మా లక్ష్యాలు నేరవేరితే వార్ ఆపేస్తాం: పుతిన్

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‎తో యుద్ధాన్ని రష్యా ప్రారంభించలేదని.. పశ్చిమ దేశాలు ఉసిగొల్పడంతో ఉక్రెయినే యుద్ధాన్ని మొదలుపెట్టిందని అన్నారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను తమపైకి ఉసిగొల్పడంతో పరిస్థితులు యుద్ధానికి దారి తీశాయని పేర్కొన్నారు. మా లక్ష్యాలు నెరవేరినప్పుడు యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తామని పుతిన్ స్పష్టం చేశారు. 

రెండు రోజుల పర్యటన కోసం గురువారం (డిసెంబర్ 4) పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. ఇండియా టూర్‎కు రావడానికి ముందు క్రెమ్లిన్‎లో ఇండియా టూడేకు ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షలు, భారత్‎తో సంబంధాల వంటి కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ వార్‎పై స్పందిస్తూ.. ‘‘రష్యా యుద్ధం ప్రారంభించలేదు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను ప్రోత్సహించాయి. మా లక్ష్యాలు నెరవేరినప్పుడు యుద్ధాన్ని పూర్తి చేస్తాం’’ అని పేర్కొన్నారు. 

నాటో యూరప్, రష్యా రెండింటికీ ముప్పు కలిగిస్తోందని, రష్యా భద్రతను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు వ్యతిరేకంగా సైనిక కూటమిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నప్పటికీ రష్యా తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. డాన్‌బాస్‌లోని రష్యన్ పౌరులు హింసించబడ్డారని.. ఎప్పటికైనా డాన్‌బాస్‌ను రష్యా పూర్తిగా విముక్తి చేస్తుందని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపి ఉక్రెయిన్‎లో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ నిస్సందేహంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కానీ ఇందుకు కొన్ని ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

మోడీ లొంగిపోయే వ్యక్తి కాదు:

అమెరికా సుంకాలకు ఇండియా తలొగ్గుతుందా అన్న ప్రశ్నకు.. భారత ప్రధాని మోడీ ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి కాదని పుతిన్ అన్నారు. తాను, ప్రధాని మోడీ మాపై ఒత్తిడి ఉన్నప్పటికీ తమ సహకారాన్ని ఉపయోగించి ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు డొంనాల్డ్ ట్రంప్‎కు సొంత ఎజెండా ఉందని, కానీ వారి వ్యవహారాల్లో ఇండియా, రష్యా ఇతరులకు హాని కలిగించవని చెప్పారు. ఇతర దేశాలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. 

అమెరికా కొన్నప్పుడు.. ఇండియా ఎందుకు కొనొద్దు..?

రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తే ఇండియాపై ట్రంప్ వాణిజ్య సుంకాలు విధించడంపైన పుతిన్ ఫైర్ అయ్యారు. అమెరికా ఇప్పటికీ తన సొంత విద్యుత్ ప్లాంట్ల కోసం రష్యా నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. తమ దేశ అవసరాల కోసం రష్యా నుంచి అమెరికా ఇంధనం కొనుగోలు చేసినప్పుడు.. భారత్ ఎందుకు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయొద్దు అని అమెరికా కపటత్వాన్ని పుతిన్ ప్రశ్నించారు. అమెరికా మాదిరిగానే ఇండియాకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదని నిలదీశారు. రష్యన్ చమురు పరిశ్రమ తన భారతీయ ప్రతిరూపాలను చాలా నమ్మదగినదిగా భావిస్తుందని అన్నారు.