- బోగస్ కేస్ షీట్లతో భారీ దోపిడీ.. విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి!
- 10 మంది డాక్టర్లు, అధికారులపై వేటుకు రంగం సిద్ధం?
హైదరాబాద్, వెలుగు: ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద(ఆయుష్) హాస్పిటల్‌లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. రోగులకు ఇవ్వాల్సిన ఆహారంలో భారీ స్కామ్ జరిగినట్టు తేలింది. డైట్ కమిటీ లేకుండానే సాగిన వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తికాగా.. బోగస్ కేస్ షీట్లతో అధికారులు భారీ దోపిడీ చేసినట్టు బయటపడింది. చనిపోయిన కాంట్రాక్టర్ పేరుతో ఆయుష్ హస్పిటల్ అధికారులు బిల్లులు కాజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. వార్డులో ఉన్న పేషంట్లకు, డైట్ లిస్టులో ఉన్నోళ్లకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చిన ఓ ఆఫీసర్ కంప్లైంట్ చేయగా.. ఈ దందా వ్యవహారం బయటపడింది.
ఇందులో ఎంట్రీ ఇచ్చిన విజిలెన్స్ అధికారులు.. హాస్పిటల్ రికార్డులన్నింటినీ జల్లెడ పట్టి అక్రమాలను నిగ్గు తేల్చారు. ఓపీ పేషెంట్లను ఇన్ పేషెంట్లుగా చూపి.. వారికి మూడు పూటలా తిండి పెట్టినట్లు రికార్డులు సృష్టిస్తూ కోట్లు కాజేశారని తేల్చారు. ఈ రిపోర్ట్‌ను అతి త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుండగా.. దందా వెనుక 10 మంది డాక్టర్లు, అధికారులు ఉన్నట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే?
ఎర్రగడ్డ ఆయుష్ హాస్పిటల్ లో 204 బెడ్లు ఉండగా.. నిత్యం సగటున 60 నుంచి 80 మంది మాత్రమే ఇన్ పేషెంట్లు ఉంటున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం రోజుకు 170 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు, వారికి మూడు పూటలా తిండి పెడుతున్నట్లు చూపించి అధికారులు డైట్ బిల్లులు కాజేస్తున్నారు. ఈ తంతు చాలా కాలంగా సాగుతున్నది. అయితే, డైట్ కాంట్రాక్ట్ ఎవరి పేరు మీద ఉందో.. ఆ వ్యక్తి 2017లోనే చనిపోయాడు.
ఆయన స్థానంలో ఓ బినామీ.. కాంట్రాక్టర్‌గా చెలామణి అవుతూ చనిపోయిన వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేస్తున్నాడు. ఆ బిల్లులు డ్రా చేస్తున్నాడు. ఇటీవల ఓ అధికారిణికి అనుమానం వచ్చి రూ. 60 లక్షల పెండింగ్ బిల్లును ఆపడంతో డొంక కదిలింది. ఆ కాంట్రాక్టర్‌ను పిలిపించాలని ఆమె ఆదేశించగా.. అతను అమెరికా వెళ్లాడని బినామీలు బుకాయించారు. తీరా ఆరా తీస్తే.. ఎనిమిదేండ్ల కిందటే చనిపోయాడని ఆయన కొడుకు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు.
డైట్ దందాలో 10 మంది?
ఈ డైట్ దందా వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలే వెలుగుచూసినట్లు తెలుస్తున్నది. ఈ గోల్ మాల్ వెనుక పెద్ద నెట్‌వర్కే నడిచినట్లు సమాచారం. హాస్పిటల్ రికార్డులన్నింటినీ జల్లెడ పట్టిన విజిలెన్స్ ఆఫీసర్లు.. ఆరోపణలు వచ్చిన టైంలో నమోదైన పేషెంట్ల వివరాలు సేకరించి, ఒక్కొక్కరికీ ఫోన్లు చేసి మరీ ఆరా తీశారు. ‘‘మీరు అసలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారా? లేదా?’’ అని ప్రశ్నించారు. ఓపీకి వచ్చి మందులు తీసుకెళ్లినోళ్లను కూడా అడ్మిట్ అయినట్లు రికార్డుల్లో రాసి నిధులు స్వాహా చేశారని విచారణలో తేలినట్లు వినిపిస్తున్నది.
హాస్పిటల్‌లోని కొందరు డాక్టర్లు, సిబ్బంది, ఆయుష్ అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా నడిచిందని, అందరూ కుమ్మక్కై ఈ ఫేక్ దందా నడిపించారని విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించినట్టు సమాచారం. స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన అధికారులకు.. ఈ దందాలో మొత్తం10 మంది పాత్ర ఉన్నట్లు క్లారిటీ వచ్చిందని, వాళ్ల పేర్లతో సహా రిపోర్ట్ రెడీ చేశారని తెలిసింది. దీనిఆధారంగా ఆ 10 మందిపై గట్టి చర్యలు ఉండే చాన్స్ ఉన్నదని తెలుస్తున్నది.
ఉద్దేశపూర్వకమా? టెక్నికల్ ప్రాబ్లమా?
కొన్ని కాలేజీల్లో స్టే టైమ్ సెకన్లలో, నిమిషాల్లో నమోదవడం గందరగోళానికి తావిస్తోంది. కామారెడ్డి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల సగటు స్టే టైమ్ కేవలం 16 సెకన్లు కాగా.. నాగర్‌కర్నూల్ లో 17 సెకన్లు, యాదాద్రిలో 18 సెకన్లు, నర్సంపేటలో 32 సెకన్లుగా నమోదవడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు ఇన్ టైమ్ విషయంలోనూ కొన్ని కాలేజీల్లో విచిత్రకర డేటా నమోదవుతోంది. నర్సంపేటలో ఏకంగా మధ్యాహ్నం 12:46 గంటలకు ఇన్- టైమ్ నమోదైంది.
మహేశ్వరం కాలేజీలో ఉదయం 9:39 గంటలకే ఔట్-టైమ్ చూపిస్తుండడం గమనార్హం. ఇది ప్రొఫెసర్లు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అక్రమమా? లేక ఎన్ఎంసీ పోర్టల్ లోని టెక్నికల్ ఇష్యూనా? అనేది వైద్యాధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది టెక్నికల్ సమస్య కాకపోతే.. ఇంత పెద్ద మొత్తంలో డ్యూటీ ఎగ్గొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
