హైదరాబాద్,వెలుగు: శబరిమల ఆలయానికి ఎలా వెళ్లాలని అడిగిన కొందరు స్వాముల పట్ల కేరళ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అపచారమని పేర్కొంటూ బుధవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. శబరిమలకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులంతా వెళ్తారని, ఏటా అక్కడ ఏదో ఒక సమస్య తలెత్తుతోందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడకు వెళ్తున్న స్వాములను ప్రతిసారీ చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ నుంచి వెళ్లిన స్వాములతో అక్కడున్న పోలీస్ అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. శబరిమలలో తెలుగు వారికి ఒక కోఆర్డినేటర్‌ని నియమించడంతో పాటు ఆఫీసును ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
