- హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు గెలిచాం
- కేంద్రం అందరికీ సంక్షేమ పథకాలిస్తున్నా.. ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటు వేయట్లేదని ప్రశ్న
కరీంనగర్/హుజూరాబాద్, వెలుగు: హిందుత్వ నినాదాన్ని గడపగడపకూ తీసుకెళ్లి బీజేపీని అధికారంలోకి తెస్తామని, తెలంగాణలో రామరాజ్య స్థాపన చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎవరేమనుకున్నా తాను హిందుత్వం గురించి మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తన నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిందంటే, అదే రోజు తన శ్వాస ఆగిపోయినట్టేనని పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఇతర నాయకుల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పహల్గాంలో హిందువులను కాల్చి చంపారు. హైదరాబాద్‌లో ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. మరి అలాంటప్పుడు హిందుత్వం గురించి మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు బీజేపీ దాదాపు అధికారంలోకి వచ్చేసినంత వాతావరణం ఏర్పడిందంటే దానికి కారణం హిందుత్వమే. జీహెచ్ఎంసీలో నలుగురు కార్పొరేటర్లుంటే.. 48 స్థానాలను గెలిచామంటే దానికి కారణమూ హిందుత్వమే” అని వెల్లడించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నది. అయినప్పటికీ ఎన్నికలొస్తే మసీదుల్లో ఇమామ్, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి” అని అన్నారు. కాగా కులం, మతం పునాదులపై రాజకీయాలు శాశ్వతంగా నడవవంటూ బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల చేసిన కామెంట్లకు కౌంటర్‌గానే సంజయ్ ఈ కామెంట్స్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
నక్సలైట్ల చావులకు అర్బన్ నక్సల్స్‌దే బాధ్యత..
దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే.. వారి చావులకు కూడా బాధ్యత వహించాలని బండి సంజయ్ అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే.. అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని మండిపడ్డారు.
