- ‘సదా పే’ యాప్‌కు ఒక్కొక్కరు రూ.6,400 పంపాలని డిమాండ్
- నిధులతో ‘ముజాహిదీన్’కు
- షూ, టెంట్ కొనుగోలుకు నిర్ణయం
- వింటర్ కిట్ స్పాన్సర్ చేయాలని వెల్లడి
- మహిళలతోనూ ఆత్మాహుతి దాడులకు జైషే ప్లాన్!
న్యూఢిల్లీ: ఇండియాలో మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మహ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాడి కోసం పాకిస్తాన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎర్రకోట బాంబు పేలుళ్లపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా దాడులకు ఫిదాయిన్ (ఆత్మాహుతి) ఆర్మీని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.6,400 విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
సదా పే (పాకిస్తాన్‌లో ఉపయోగించే యాప్)కు డబ్బులు పంపాలని, ఆ నిధులతో సూసైడ్ బాంబర్ కోసం అవసరమయ్యే షూ, వూలెన్ సాక్సులు, మ్యాట్రస్, టెంట్ కొనుగోలు చేస్తామని చెప్తున్నది. దాడికి ముందు సూసైడ్ బాంబర్ (ముజాహిదీన్)కు ఫీల్డ్ లో కావాల్సిన వస్తువులన్నీ కొనేందుకు సహకరించాలని పాకిస్తానీయులను జైషే మహ్మద్ డిమాండ్ చేస్తున్నది.
చలికాలంలో వారికి వింటర్ కిట్ స్పాన్సర్ చేయాలని , డొనేట్ చేసిన వారిని జిహాదీలుగా గుర్తిస్తామని వెల్లడించింది. మరిన్ని డబ్బులు ఇస్తే, దాడి తర్వాత ముజాహిదీన్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. జిహాద్ (పవిత్ర యుద్ధం)లో పాల్గొన్న వారిని ఎప్పటికీ మరిచిపోమని జైషే మహ్మద్ చెప్తున్నది.
పార్కింగ్ ఏరియాలోనే బాంబు తయారీ!
ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ స్పీడప్ చేసింది. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ.. దాడికి ముందు సుమారు 3 గంటల పాటు కారును పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. మధ్యాహ్నం 3.19 గంటల టైమ్‌లో కారు పార్కింగ్ ఏరియాకు చేరుకోగా.. అక్కడి నుంచి సాయంత్రం 6.28 గంటలకు బయల్దేరింది. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగింది. కారు పార్కింగ్‌లో ఉన్నంత సేపు ఉమర్ అస్సలు బయటికి రాలేదు. ఆ సమయంలోనే బాంబు తయారు చేసి ఉంటాడని దర్యాప్తు ఏజెన్సీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
10వ తేదీ ఉదయం నుంచి సున్హేరి మసీద్ సమీపంలోని పార్కింగ్ ఏరియాకు కారు చేరుకునేదాకా ఉమర్ తన హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్నట్లు తేలింది. బాంబును ఎక్కడ బ్లాస్ట్ చేయాలి? ఎలా చేయాలి? అనేదానిపై చర్చించినట్లు సమాచారం. అయితే, సోమవారం ఎర్రకోట సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఉండదనే విషయం తెలుసుకోలేకపోయాడు. అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్‌మార్గ్‌లో బ్లాస్ట్ చేయాలని ఉమర్, అతని హ్యాండ్లర్ డిసైడ్ అయినట్లు సమాచారం. దీనికి ఓవైపు ఎర్రకోట ఉండగా.. మరోవైపు చాందినీచౌక్ ఉంది. పార్కింగ్ నుంచి కారు బయటకు తీసి ట్రాఫిక్‌లో తీసుకొచ్చి దాన్ని పేల్చేశాడు.
ఆత్మాహుతి దాడుల్లో మహిళలు!
సూసైడ్ బాంబర్లుగా మారేందుకు మహిళలకూ జైషే మహ్మద్ అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. మసూద్ అజహర్ చెల్లె సాధియా.. టెర్రరిస్ట్ ‘ఉమెన్ వింగ్’ను లీడ్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాతే.. మహిళలు కూడా టెర్రర్ యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట దాడిలోనూ.. 10 మందితో కూడిన టెర్రర్ డాక్టర్ల బృందం స్పీడ్‌గా నిధులు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. తాజాగా పాక్‌లో నిధుల సేకరణకు సంబంధించిన సాక్ష్యాలను నిఘా వర్గాలు గుర్తించాయి.
