- అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత విడుదల
బషీర్‌బాగ్, మెహిదీపట్నం, వెలుగు: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నాంపల్లి సింగరేణి భవనం ముందు ఏబీ సింగరేణి మైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. సింగరేణి సంస్థను రక్షించేందుకు.. వేలం పాటకు సంబంధం లేకుండా బొగ్గు బ్లాకులు నేరుగా కేటాయించాలన్నారు. ప్రతి ఏడాది 5 కొత్త భూగర్భ గనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా కంపెనీ కార్మికులతో నడపాలని, ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను జెన్కో, ట్రాన్స్‌కో తరహాలో రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
‘‘కోల్ ఇండియా విధానంలో కార్మికులకు అలవెన్సులపై వసూలు చేసిన ఇన్‌కం ట్యాక్స్‌ను సంస్థ తిరిగి చెల్లించాలి. పాత వీఆర్ఎస్ పథకాన్ని పునరుద్ధరించి.. రెండేండ్ల సర్వీస్ ఉన్న అన్‌ఫిట్ కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. 30 ఏండ్ల సర్వీసు పూర్తిచేసి అన్‌ఫిట్ కార్మికుల వారసుల ఉద్యోగాలను మారుపేర్లు, 10వ తరగతి అర్హత, విజిలెన్స్ విచారణ పేర్లు చెప్పి నిలిపివేయడం అన్యాయం. మెడికల్ బోర్డులో అన్‌ఫిట్ గా తేలినా, రెండేండ్ల సర్వీస్ మిగల్లేదన్న కారణంతో డిపెండెంట్ ఉద్యోగాలను నిలిపివేయడం సరికాదు’’అని కవిత అన్నారు. ఆ తర్వాత పోలీసులు కవితను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.
సౌదీ బస్సు ప్రమాదం..బాధిత కుటుంబాలకు కవిత పరామర్శ
సౌదీ అరేబియాలోబస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం ఆసిఫ్ నగర్ జిర్రా నటరాజ్ నగర్ లో పక్క పక్కనే ఉన్న మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, మహమ్మద్ అలీ కుటుంబాలను పరామర్శించి వారికి భరోసాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరం అని వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం తొందరగా స్పందించి బాధిత కుటుంబసభ్యులు సౌదీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
