ఏఐటీయూసీ కృషితోనే గనుల జీవితకాలం పెంపు : రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య

ఏఐటీయూసీ కృషితోనే గనుల జీవితకాలం పెంపు :  రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య

నస్పూర్, వెలుగు: ఏఐటీయూసీ కృషి ఫలితంగానే భూగర్భ గనుల జీవితకాలాన్ని పెంచారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 1గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచిన తర్వాత సింగరేణి అధికారులతో చర్చించి గనుల జీవిత కాలాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

ఈ ఏడాది మార్చి నాటికి ఎస్సీర్పీ1 గనిని మూసివేయాలని యాజమాన్యం ప్రకటించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి యాజమాన్యాన్ని ఒప్పించడంతో గని జీవితకాలాన్ని మరో 5 సంవత్సరాలు పెంచినట్లు పేర్కొన్నారు. ఆర్కే న్యూటెక్ గనిని కూడా యాజమాన్యం మూసివేసే ఆలోచనలో ఉంటే యాజమాన్యాన్ని ఒప్పించి గని జీవిత కాలాన్ని కూడా పెంచామన్నారు. గత గుర్తింపు కార్మిక సంఘం పైరవీలకే పరిమితమై పదేండ్లలో కనీసం స్ట్రక్చర్ సమావేశాలు కూడా నిర్వహించలేకపోయిందని విమర్శించారు.

 తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో స్థానిక నాయకులు కె.వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బాజీ సైదా, ఎం.కొమురయ్య, చంద్రమోహన్, బుచ్చయ్య, అప్రోజ్ ఖాన్, దాడి రాజయ్య, మోతె లచ్చన్న, మురళీ చౌదరి, సారయ్య తదితరులు పాల్గొన్నారు.