కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతి మహిళకు చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పర్యవేక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలన్నారు. ఓపెన్ స్కూల్, వయోజనుల విద్య నమోదులో నిర్దేశిత లక్ష్యాన్ని జిల్లా సాధించిందన్నారు.
ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో నమోదు చేసుకున్నారని, వీరంతా రెగ్యులర్‌గా తరగతులు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతీ మూడో శనివారం పేరెంట్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారం చీరల పంపిణీ చేయాలి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: జిల్లాలో ఇందిరా మహిళా చీరల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. బుదవారం ఆమె సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫ్ రెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చీరల పంపిణీకి నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
