ఇప్పపువ్వు లడ్డూతో రక్తహీనతకు చెక్ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఇప్పపువ్వు లడ్డూతో రక్తహీనతకు చెక్ :  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ఇప్పపువ్వు లడ్డూతో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేటలో ఏర్పాట చేసిన ఇప్పపువ్వు లడ్డూ దుకాణాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పపవ్వు లడ్డూతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రక్తహీనత ఉన్న ప్రతి ఒక్కరూ తినాలని సూచించారు. గర్భిణులు తప్పనిసరిగా తినాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.అంతకుముందు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుల్లో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 

గ్రామాల్లోని సమస్యల పరిష్కరానికి అధికారులు కృషి చేయాలి

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఉట్నూర్​మండలంలోని లక్షీటిపేట గ్రామంలో అధికారులు, రాయి సెంటర్ సార్మెడీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరగక ఆటంకంగా మారాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయక ఆదివాసీలపై తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రాయి సెంటర్ సార్మేడీలు, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.