జన్నారం, వెలుగు: జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించే రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు స్టేట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ బెంజిమెన్ పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భవన్ కు అంబేద్కర్ పేరుపెట్టాలని, ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నారని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే సభకు దళితులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో మాలమహనాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండ దేవేందర్, నాయకులు దేవయ్య, రాజారావు, నర్సయ్య, తిరుపతి, అమృతరావు, ముల్కల్ల రాజారావు తదితరులు పాల్గొన్నారు.
